నేటి నుంచి విత్డ్రాలపై ఆంక్షలు లేవు.. కానీ!

13 Mar, 2017 12:28 IST|Sakshi
నేటి నుంచి విత్డ్రాలపై ఆంక్షలు లేవు.. కానీ!
న్యూఢిల్లీ: సేవింగ్స్ అకౌంట్ నుంచి మీరు ఇక ఎంత నగదు అయినా విత్ డ్రా చేసుకోవచ్చు. సేవింగ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రాయల్స్పై ఉన్న ఆంక్షలు ఇవాళ్టి నుంచి తొలగిపోయాయి. ఈ మేరకు జనవరి 30న ఆర్బీఐ చేసిన ప్రకటన ప్రకారం.. నేటి(మార్చ్ 13) నుంచి ఆంక్షలు తొలగించబడ్డాయి. 
 
డీమోనిటైజేషన్ అనంతరం ఏర్పడ్డ నగదు కొరత పరిస్థితులను అదిగమించేందుకు ఆర్బీఐ తొలుత రోజుకు రూ. 2000 మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. తరువాత దీనిని రోజుకు రూ. 4500కు, ఆ తరువాత వారానికి రూ. 24,000కు మించకుండా రోజుకు రూ 10,000 వరకు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అనంతరం ఫిబ్రవరి 20న వారానికి గల లిమిట్ను రూ 24,000 నుంచి రూ. 50.000కు పెంచిన విషయం తెలిసిందే. 
 
ఆర్బీఐ నిర్ణయంతో నగదు విత్డ్రాపై ఆంక్షలు లేకపోవడంపై ఓ వైపు హర్షం వ్యక్తమౌతోంది. కానీ.. ఏటీఎంల వద్ద ఇప్పటికీ కనిపిస్తున్న నోక్యాష్ బోర్డుల పట్ల ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్లో నాలుగైదు రోజులుగా నోట్ల కష్టాలు కొనసాగతుతున్నాయి. డబ్బుకోసం ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు.