క‌రోనా : దేశంలో సామాజిక వ్యాప్తి ద‌శ‌కు చేరుకోలేదు

9 Jul, 2020 16:17 IST|Sakshi

న్యూఢిల్లీ :  భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి( క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ ) ద‌శ‌కు చేరుకోలేద‌ని ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్ మ‌రోసారి స్ప‌ష్టం  చేశారు.  గురువారం 18వ ఉన్న‌త స్థాయి మంత్రులు, నిపుణుల స‌మీక్ష‌లో పాల్గొన్న మంత్రి తాజా ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నంతో పాటు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ.. ''క‌రోనా ప్ర‌భావిత దేశాల్లో భార‌త్ మూడో స్థానంలో ఉంద‌ని ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ఈ గ‌ణాంకాల‌ను  స‌రైన కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌పంచంలోనే జానాభా ప‌రంగా రెండో స్థానంలో ఉన్న మ‌న దేశంలో ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల జ‌నాభాకు 538 కేసులే న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌పంచ స‌గటు ప‌రంగా  1453 కేసులు న‌మోదువుతుంటే భార‌త్‌లో ఈ సంఖ్య త‌క్కువ‌గా ఉంది.  కొన్ని ప్రాంతాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ దేశ వ్యాప్తంగా చూస్తే  క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ ద‌శ‌కు మ‌నం ఇంకా చేరుకోలేదు'' అని హ‌ర్ష‌వ‌ర్ద‌న్ పున‌రుద్ఘాటించారు.  ఈ స‌మావేశంలో ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి ప్రీతి సుడాన్, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఐసీఎంఆర్ డిజి డాక్ట‌ర్ బ‌ల‌రాబ్ భ‌ర‌గ‌వ స‌హా ప‌లువురు నిపుణులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే క‌రోనా సామాజిక వ్యాప్తికి ఇంకా చేరుకోలేద‌ని నిపుణుల బృందం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. (భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! )

ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య  7,67,29కు చేరుకోగా గ‌డిచిన 24 గంట‌ల్లోనే రికార్డు స్థాయిలో 24,879 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో అత్య‌ధిక కేసులు   మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, డిల్లీ, తెలంగాణ, యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే న‌మోద‌య్యాయి. దేశ వ్యాప్తంగా న‌మోదైన కేసుల్లోనూ  75 శాతం ఈ రాష్ర్టాల్లోనే న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. భార‌త్‌లో వ‌రుస‌గా ఏడ‌వ‌రోజు కూడా 20వేల‌కు పైగానే క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌గా రిక‌వ‌రీ రేటు మాత్రం అధికంగానే ఉంద‌ని పేర్కొంది. ఇప్ప‌టికే  4,76,377 మంది క‌రోనా నుంచి కోలుకోగా ప్ర‌స్తుతం 2,69,789 యాక్టివ్ కేసులే ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. (యూపీలో తక్కువ టెస్టులే.. అయినా మెరుగ్గానే! )


 


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు