కరోనా: ఢిల్లీలో క‌మ్యూనిటీ ట్రాన్సిమిష‌న్ లేదు

9 Jun, 2020 16:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్‌‌ సిసోడియా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశం లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌,  విపత్తు నిర్వాహణ శాఖ చైర్మన్‌ అనిల్‌ బైజాల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మనీష్‌‌ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో కరోనా వైరస్‌ కేసులు వేగంగా పెరగడానికి కారణం క‌మ్యూనిటీ ట్రాన్సిమిష‌న్ కాదంటూ కేంద్ర అధికారులు పేర్కొన్నారని వెల్లడించారు. గతవారం నుంచి పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ క‌మ్యూనిటీ ట్రాన్సిమిష‌న్ జరగలేదని అధికారులు తెలిపారని అన్నారు. జూలై నెల చివరికల్లా 5.5 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావచ్చని, కరోనా బాధితులకు వైద్యం అందిచడానికి 80 వేల బెడ్లు కావాలని పేర్కొన్నారు. (జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్‌)

ఈ సమావేశానికి ముందు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ మాట్లాడుతూ.. ఢిల్లీలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం మందికి వ్యాధి ఎలా సంక్రమిస్తోందో సరైన సమాచారం లేదని తెలిపారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ముందస్తుగానే సెల్ఫ్‌ ఐసోలేషన్‌కి పరిమితమయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీలో కొత్తగా 1007 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 874 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. (24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు)

మరిన్ని వార్తలు