పునర్విభజన లేదు

7 May, 2016 06:41 IST|Sakshi
పునర్విభజన లేదు

ఎన్నికల సంఘం స్పష్టీకరణ

  • కేంద్ర హోంశాఖ కూడా అదే చెప్పిందని వివరణ
  • ఆర్టీఐ కింద ఈసీ సమాధానం
  • ‘సాక్షి’ వద్ద ఈసీ, హోంశాఖ లేఖలు
  • 2026 జనాభా లెక్కలు తేలే వరకు పునర్విభజన సాధ్యం కాదు
  • రాజ్యాంగంలోని 170(3) అధికరణే సుప్రీం...
  • ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి రాజ్యాంగం అడ్డుకట్ట

 సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన జరగనున్నదంటూ సాగుతున్న ఊహాగానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. సమీప భవిష్యత్‌లో రెండు తెలుగురాష్ట్రాలలో శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదని అది తేల్చేసింది. సమాచార హక్కు చట్టం కింద  ‘సాక్షి’కి ఇచ్చిన సమాధానంలో ఈ మేరకు అది స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయ సలహా కోరిందా? భారత అటార్నీ జనరల్ నుంచి ఏదైనా సలహా కోరిందా? ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపును చేపట్టే ప్రతిపాదన ఏదైనా ఉందా? అంటూ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమాధానం ఇచ్చింది.

ఈనెల 4 తేదీతో ఉన్న ఎన్నికల సంఘం లేఖ ‘సాక్షి’కి శుక్రవారం అందింది.  తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు వీలుకల్పించే చట్టం ఏదీ లేనందున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని అది వివరించింది.  రాజ్యాంగంలోని 170 (3) అధికరణ లోని నిబంధనలే అమలులో ఉంటాయంటూ  కేంద్ర హోంశాఖ నుంచి తమకు అందిన లేఖ ప్రతిని కూడా ఈ లేఖతో పాటు అందించింది. అంటే రాజ్యాంగ సవరణ చేస్తూ మరో చట్టం చేస్తే తప్ప పునర్విభజనకు అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.

ఆ ప్రక్రియ ఎప్పుడో ఆగిపోయింది...
నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ నిజానికి 2014 సెప్టెంబర్‌లోనే నిలిచిపోయింది. ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖ లేఖలను పరిశీలిస్తే ఈవిషయం అర్ధమౌతుంది. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్ర హోంశాఖ చేపట్టింది. పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కొన్ని వివరణలు కావాలని అది భావించింది. దీనిపై కేంద్ర హోంశాఖ, లా అండ్ జస్టిస్ మంత్రిత్వశాఖలోని లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. ఆ తర్వాత 2014 సెప్టెంబర్ 8న మాకు కేంద్ర హోంశాఖ ఒక లేఖ రాసింది.’’ అని ఎన్నికల సంఘం వివరించింది.  ‘‘లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ సూచనలను కేంద్ర హోంశాఖ ఆ లేఖలో ప్రస్తావించింది. రాజ్యాంగంలోని 170 (3) అధికరణను బట్టి చూస్తే ఎస్‌సి ఎస్టీ నియోజకవర్గాల పునః పంపిణీకి అవసరమైన సర్దుబాటుకు తప్ప పునర్విభజనకు అవకాశమే లేదు. అందువల్ల సమీప భవిష్యత్‌లో రెండు రాష్ట్రాలలో నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు గాను  పూర్తిస్తాయి పునర్విభజన ప్రక్రియ అవసరమే లేదని కేంద్ర హోంశాఖ తెలిపింది’’ అని ఎన్నికల సంఘం వివరించింది.

ఈసీకి హోం శాఖ జవాబు ఇదీ..
కేంద్ర హోం శాఖ పంపిన ఆఫీస్ మెమోరాండంను కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమాచార హక్కు కింద ఇచ్చిన జవాబుతో జతపరిచింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుమిత్ ముఖర్జీకి ఈ లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..

 మీరు జూన్ 26, 2014న రాసిన లేఖకు సంబంధించి ఈ లేఖ రాస్తున్నాం. మీరడిన వివరాలపై కేంద్ర న్యాయశాఖ సలహా తీసుకున్నాం. వారు చెప్పినదేంటంటే ‘‘కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 2002 నుంచి 2008 మధ్య చేపట్టింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వును కేంద్రం 2008లో నోటిఫై చేసింది. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ స్థానాల పెంపు సబబని భావించి,  ఆర్టికల్ 170కి లోబడి ఈ ప్రక్రియ ఉండాలని చట్టంలో పొందుపరిచింది. అయితే ఈ సెక్షన్‌కు సంబంధించి ఎలాంటి గడువు విధించలేదు. అందుకు కారణం ఆర్టికల్ 170 అనేది ఒక సమగ్రమైన నిబంధన. ఇది మొత్తం సీట్లను నిర్ధారించడానికి, ప్రతి రాష్ట్రాన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు గానూ విభజించడానికి గల ప్రమాణాన్ని నిర్ధేశిస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి గమనించాల్సిన ముఖ్య విషయం మరొకటి ఉంది. ఈ నిబంధన(సెక్షన్ 26) భవిష్యత్తులో అమలయ్యేదానిని సూచిస్తోంది. అంతేకాకుండా ఆర్టికల్ 170లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 15ను చూడాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణచట్టంలోని సెక్షన్ 26లో చెప్పిన తరహాలో సీట్ల పెంపు యోచన సెక్షన్ 15కు సంబంధం లేకుండా రాజ్యాంగ నిబంధనలకు లోబడి నూతనంగా పునర్విభజన ప్రక్రియ చేపట్టే వరకు ప్రస్తుత స్థితి కొనసాగుతుంది.
 
 ఆర్టికల్ 170 (3) ఏం చెబుతోందంటే....
 ప్రతి జనాభా లెక్కల తరువాత అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్యను, అదే విధంగా నియోజక వర్గాల ప్రాదేశిక పరిధులను పార్లమెంట్‌లో చట్టం తెచ్చి, ఆ చట్టం పేర్కొన్న విధంగా పునఃసర్దుబాటు చేసుకోవచ్చు. అయితే ఆ మార్పులు అప్పటికే ఉన్న అసెంబ్లీలోని ప్రాతినిధ్యాన్ని ఆ అసెంబ్లీ రద్దు అయ్యేంత వరకూ ఏ విధంగానూ ప్రభావితం చెయ్యకూడదు. అంతేకాక ఆ పునఃసర్దుబాటు రాష్ట్రపతి జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్న తేదీ నుంచే అమలులోకి రావాలి. ఆ లోపు అసెంబ్లీకి జరిగే అన్ని ఎన్నికలూ పునఃసర్దుబాటుకు ముందు ఉన్న నియోజక వర్గాలకే జరగాలి. అంతేకాక 2026 సంవత్సరం తరువాతి మొదటి జనగణనకి చెందిన గణాంకాలన్నీ ప్రచురితమయ్యేంత వరకూ, 1) 1971 జనగణన ఆధారంగా ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మార్పు చేసిన నియోజక వర్గాల సంఖ్యను, 2) 2001 జనగణన ఆధారంగా ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మార్పు జరగబోయే నియోజక వర్గాల ప్రాదేశిక పరిధులను పునఃసర్దుబాటు చెయ్యాల్సిన అవసరం లేదు.


 

మరిన్ని వార్తలు