చివరిదశలో ఒంటరి వ్యథలు

29 Jun, 2017 18:58 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ఇద్దరు వృద్ధుల్లో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ దాదాపు 15 వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. వీరిలో 47.49 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు గుర్తించింది. పట్టణాల్లో ఉండే వారిలో 64.1 శాతం మంది ఒంటరితనాన్ని అనుభవిస్తుండగా పల్లెల్లో ఇది 39.19 శాతంగా ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారితో పోలిస్తే పట్టణాల్లో ఉన్నవారిలో ఒంటరితనం భావన ఎక్కువ ఉన్నట్టు స్పష్టమైంది. వీరిలో అధికులు ఒంటరిగా కానీ వారి జీవిత భాగస్వామ్యులతో కానీ ఉంటున్నారని పేర్కొంది. అనారోగ్య కారణాలు, కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం తదితర కారణాల వల్ల వీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఒంటరితనం కారణంగా ప్రతి ఐదుగురు వృద్ధుల్లో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని దీనిని అధిగమించేందుకు కౌన్సిలింగ్‌ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 2017 ఏప్రిల్‌– జూన్‌ మధ్య ‘చేంజింగ్‌ నీడ్స్‌ అండ్‌ రైట్స్‌ ఆఫ్‌ ఓల్డర్‌ పీపుల్‌’పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది.
 

మరిన్ని వార్తలు