ఏ దేశమూ అందరినీ ఆహ్వానించదు

8 Mar, 2020 06:28 IST|Sakshi

సీఏఏ ఆందోళనలపై విదేశాంగ మంత్రి జైశంకర్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఏ దేశమూ అందరినీ ఆహ్వానించదని విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. ఎకనామిక్‌ టైమ్స్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సమిట్‌లో సీఏఏ వ్యతిరేక వాదనలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘ఏ దేశానికీ చెందని వారిని పౌరులుగా గుర్తించేందుకు ఈ చట్టం చేశాం. దేశం ఎదుర్కొంటున్న శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.  పౌరసత్వంపై దేశానికో నిర్వచనం, విధానం ఉంటాయి. ప్రపంచంలో అందరినీ స్వాగతించే దేశమేదైనా ఉంటే చూపండి. అలా ఎవరూ చూపలేరు. అమెరికాను చూడండి. యూరోపియన్లను చూడండి. యూరప్‌లో అయితే ఒక్కో దేశానికీ ఒక్కో విధానం ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో భారత్‌ ప్రపంచాన్ని ఒప్పించలేకపోయిందా అన్న ప్రశ్నకు ఆయన.. బ్రస్సెల్స్‌లో 27 దేశాల మంత్రులతో జరిగిన సమావేశంలో సీఏఏపై వాస్తవాలను వివరించానన్నారు.

ఈ విషయంలో భారత్‌ తన స్నేహితులను కోల్పోతుందా అన్న ప్రశ్నపై.. వాస్తవ మిత్రులెవరో కూడా ఇప్పుడే తెలిసే అవకాశం ఉంది కదా? అని ప్రశ్నించారు. ‘ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం భారత్‌. మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. గతంలో మాదిరిగా నేడు రక్షణాత్మకంగా వ్యవహరించ లేదు. ప్రతి ఒక్కరితోనూ సంబంధాలు కలిగి ఉండాలి. ప్రతి సమస్యకూ పరిష్కారం కనుగొనాల్సిందే. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను కొందరు అంగీకరించవచ్చు. మరికొందరు అంగీకరించక పోవచ్చు. ఈ రెంటినీ ఒకే గాటన కట్టలేం. ఇందుకు తగినట్లుగా ఆయా దేశాలతో మనం వ్యవహారం సాగించాల్సి ఉంది’అని తెలిపారు. కశ్మీర్‌లో పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌ (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) డైరెక్టర్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఆయన స్పందిస్తూ.. గతంలోనూ యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇటువంటి తప్పుడు అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. కశ్మీర్‌లో పొరుగుదేశం ప్రేరేపిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ఏమీ చేయలేకపోయింది’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు