హిందూ ముస్లింలపై సీఎం యోగి వ్యాఖ్యలు

6 May, 2017 14:43 IST|Sakshi
హిందూ ముస్లింలపై సీఎం యోగి వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందూ ముస్లింలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తనకు 'బొట్టు'కు, 'టోపీ'కి ఏమీ తేడా లేదని చెప్పారు. ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనిలా చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని, ఆ విషయంలో ఏ ఒక్కరికీ అధిక ప్రాధాన్యం లేద అప్రాధాన్యం ఇవ్వడం ఉండబోదని స్పష్టం చేశారు.

యోగి స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటోందన్న నివేదికలను ప్రస్తావించగా.. చాలా తీవ్ర స్వరంతో స్పందించారు. మెడలో కాషాయ కండువాలు వేసుకున్నవాళ్లు బాగుపడాలని, లేకపోతే మాత్రం వాళ్లను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బీజేపీని గానీ లేదా వేరే ఏదైనా సంబంధిత సంస్థను గానీ పేరు పాడుచేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లందరినీ గుర్తించి మరీ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జంగల్‌రాజ్ అంతమైపోతుందని హామీ ఇచ్చారు.

శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నా.. తన ప్రభుత్వ వందరోజుల పాలన పూర్తయ్యేసరికి అవన్నీ కచ్చితంగా ఆగిపోతాయని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతి చెల్లి, సోదరి సురక్షితంగా ఉంటారని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతామని యోగి అన్నారు. తాజాగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తరప్రదేశ్ నగరాలు ఏవీ లేకపోవడాన్ని ప్రస్తావించగా, వచ్చే సంవత్సరం సర్వే చేసేసరికి మొత్తం 100 టాప్ నగరాల్లో 50 మనవే ఉంటాయని అన్నారు. కొత్త ముఖ్యమంత్రి రాగానే పాలనా యంత్రాంగాన్ని మార్చాలనుకుంటారని, కానీ తాము మాత్రం అదే అధికారులతో పరిపాలన తీరును మారుస్తున్నామని అన్నారు. గత 12-15 ఏళ్లుగా అధికారుల బదిలీలంటే ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయిందని, దాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు