పోలీసులతో ఘర్షణ; అలాంటిదేం లేదు..!

12 Aug, 2019 18:08 IST|Sakshi

శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో దాదాపు 40 వేల మంది భద్రతా సిబ్బందిని అక్కడ బందోబస్తుకు వినియోగించుకుంటోంది. అయితే, జమ్మూకశ్మీర్‌ పోలీసులకు, సీఆర్పీఎఫ్‌ జవాన్లకు మధ్య ఘర్షణలు తలెత్తాయని వార్తలు బయటికొచ్చాయి. కర్ఫ్యూ పాస్‌ లేదని ఓ గర్భిణీని అడ్డుకోవడంతో రాష్ట్ర పోలీసు సిబ్బంది, సీఆర్పీఎఫ్‌ జవాన్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుందనీ..  రాష్ట్ర పోలీస్‌ సిబ్బంది ఒకరు కాల్పులు జరపడంతో ఐదురుగు జవాన్లు చనిపోయారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. వాజ్‌ ఎస్‌ ఖాన్‌ పేరుతో ఓ పాకిస్తానీ ఈ ప్రచారానికి పూనుకున్నాడు.

ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని సీఆర్పీఎఫ్‌, కశ్మీర్‌ పోలీసు దళం కొట్టిపారేశాయి. పుకార్లను నమ్మొద్దని స్పష్టం చేశాయి. రక్షణ దళాలేవైనా దేశం కోసం.. సుహృద్భావం వాతావరణంలో పనిచేస్తాయని చెప్పాయి. కోట్లాది భారతీయుల రక్షణ కోసం త్రివర్ణ పతాకం నీడలో తామంతా దేశ సేవకు అంకితమవుతామని.. తమ మధ్య ఎలాంటి భేదాలుండవని వెల్లడించాయి. యూనిఫారమ్‌లు వేరైనా మా లక్ష్యం దేశ రక్షణే అని సీఆర్పీఎఫ్‌ ట్వీట్‌ చేసింది.

కొందరు నకీలీ కశ్మీరీలు ఉన్నతాధికారుల పేర్లతో ఫేక్‌ అకౌంట్లు సృష్టించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని కశ్మీర్‌ పోలీస్‌ అధికారి ఇంతియాజ్‌ హస్సేన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనడంతో కొన్ని దుష్ట శక్తులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కల్పనలో ఉండకుండా వాస్తవంలోకి రావాలని హితవు పలికారు.


Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా