అన్ని నిర్ణయాలపై అనుమాన దృక్కోణం వద్దు

30 Nov, 2013 03:18 IST|Sakshi

 న్యూఢిల్లీ: ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ అనుమాన దృక్కోణంలో చూస్తే చివరకు పాలన స్తంభించిపోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా పార్లమెంటరీ వ్యవస్థలో కీలక భాగమే అయినప్పటికీ దేశాన్ని పాలించే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో అహ్మదాబాద్‌లో ‘అంతర్జాతీయ ఆర్థిక సేవల నగరం’ (ఐఎఫ్‌ఎస్‌సీ) ఏర్పాటు చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది.
 
 ఐఎఫ్‌ఎస్‌సీని సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి గుజరాత్ ప్రభుత్వం ‘గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ టెక్ సిటీ లిమిటెడ్ (జీఐఎఫ్‌టీ)తో 2011లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు 412 ఎకరాల భూమిని జీఐఎఫ్‌టీకి కేటాయించింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. మరోవైపు కాగ్ కూడా తన నివేదికలో ఈ ప్రాజెక్టుపై పలు అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ వ్యవహారంపై విచారించిన ధర్మాసనం... ప్రాజెక్టుపై ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చింది.

మరిన్ని వార్తలు