రోహిత్‌ వేములపై చిత్రానికి ‘నో ఎంట్రీ’

22 Jan, 2020 15:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్శిటీ దళిత విద్యార్థి నాయకుడు రోహిత్‌ వేములపై తీసిన చిత్రంతోపాటు ఇప్పటికే విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న పలు డాక్యుమెంటరీ చిత్రాలకు ముంబైలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు ఫిల్మ్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో కొనసాగనున్న ద్వైవార్షిక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఎంట్రీ దొరకలేదు. 2016లో రోహిత్‌ వేముల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ‘వియ్‌ హావ్‌ నాట్‌ కమ్‌ ఇయర్‌ టు డై’ పేరిట దీపా ధన్‌రాజ్‌ డాక్యుమెంటరీని నిర్మించారు. 2018లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో ‘బెస్ట్‌ ఫీచర్‌ లెన్త్‌ డాక్యుమెంటరీ అవార్డు’ను అందుకున్న ‘రీజన్‌’ చిత్రానికి కూడా ఎంట్రీ దొరక లేదు. కమ్యూనిస్టు నాయకుడు గోవింద్‌ పన్సారే, హేతువాది నరేంద్ర దాభోల్కర్‌ హిందుత్వ వాదులు హత్య చేయడంపై ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ పట్వర్ధన్‌ ఈ డాక్యుమెంటరీని తీశారు.

పట్వర్ధన్‌కు 2014లో ‘శాంతారామ్‌– జీవితకాలం పురస్కారం’ అవార్డు లభించిన విషయం తెల్సిందే. విశాఖపట్నంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ప్రశంసలు అందుకుంటున్న గాయకురాలు, గేయ రచయిత్రి, మ్యూజిక్‌ కంపోజర్‌ సోన మొహాపాత్రపై దీప్తి గుప్తా తీసిన ‘షటప్‌ సోనా’కు, కళాకారుడు కౌషిక్‌ ముఖోపాధ్యాయ్‌పై అవిజిత్‌ ముకుల్‌ కిషోర్‌ తీసిన ‘స్క్వీజ్‌ లైమ్‌ ఇన్‌ యువర్‌ ఐ’ చిత్రానికి ఎంట్రీ లభించలేదు. రోహన్‌ శివకుమార్‌ తీసిన ‘లవ్లీ విల్లా’, అర్చనా పాడ్కే తీసిన ‘అబౌట్‌ లవ్‌’ చిత్రాలకు కూడా ఎంట్రీ దొరకలేదు. ఎంపిక చేసిన 800 డాక్యుమెంటరీల్లో విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలకు ఎందుకు ఎంపిక చేయలేదని ఫిల్మ్స్‌ డివిజన్‌ డైరెక్టర్‌ జనరల్, ముంబై అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ డైరెక్టర్‌ స్మితా వాట్స్‌ శర్మను మీడియా ప్రశ్నించగా, తమ ఎంపిక నిష్మక్షపాతంగా జరిగిందని, అందులో ఎలాంటి రాజకీయం లేదని సమాధానం చెప్పారు.

మరిన్ని వార్తలు