ఆ వార్డులకు మహిళా సిబ్బంది దూరం..

3 Apr, 2020 14:47 IST|Sakshi

లక్నో : ఢిల్లీ మర్కజ్‌లో పాల్గొని తిరిగివచ్చి ఐసోలేషన్‌ వార్డుల్లో చేరిన తబ్లిగి జమాతే సభ్యుల సేవల కోసం పురుష సిబ్బందినే నియమించాలని అక్కడ మహిళా కానిస్టేబుళ్లు, నర్సులకు విధులు కేటాయించరాదని యోగి ఆదిత్యానాథ్‌ నేతృత్వంలోని యూపీ సర్కార్‌ ఆదేశించింది. కరోనా వైరస్‌ అనుమానితులుగా ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్న కొందరు తబ్లిగీ జమాతే సభ్యులు తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఘజియాబాద్‌ ఎంఎంజీ జిల్లా ఆస్పత్రి నర్సులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో యూపీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జమాతే సభ్యులకు వైద్య, భద్రతా సేవల కోసం పురుష సిబ్బందినే ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఘజియాబాద్‌ ఆస్పత్రిలో నర్సింగ్‌ సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరించిన తబ్లిగీ జమాతే సభ్యులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద చర్యలు చేపట్టాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని మానవత్వానికి శత్రువులుగా యోగి ఆదిత్యానాథ్‌ అభివర్ణించారు. నిందితులు చట్టాన్ని గౌరవించకపోవడమే కాకుండా సమాజ కట్టుబాట్లనూ అంగీకరించలేదని..వారు మానవత్వానికే శత్రువులని వ్యాఖ్యానించారు. ‘వారు మహిళా ఆరోగ్య కార్యకర్తల పట్ల వ్యవహరించిన తీరు హేయం..వారిపై ఎన్‌ఎస్‌ఏ కింద చర్యలు చేపడతాం..వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్ట’మని యోగి అన్నారు. మరోవైపు తబ్లిగి జమాతే సభ్యుల ప్రవర్తనపై కేంద్ర మంత్రి, ఘజియాబాద్‌ ఎంపీ వీకే సింగ్‌ మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ డాక్టర్లకు సహకరించాలని, మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

చదవండి : యాంటీ మలేరియా డ్రగ్‌తో డాక్టర్‌ మృతి

మరిన్ని వార్తలు