విశ్వాస పరీక్షపై స్టే

21 Sep, 2017 01:36 IST|Sakshi
విశ్వాస పరీక్షపై స్టే

తమిళనాడు ‘రాజకీయం’పై మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు
18 నియోజకవర్గాల్లో ఉపఎన్నికల నోటిఫికేషన్‌ వద్దని ఆదేశం
అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా


సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై విధించిన స్టే తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలుగా తమపై అనర్హత వేయటాన్ని కొట్టివేయాలంటూ 18 మంది దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే తదుపరి విచారణను అక్టోబర్‌ 4కు వాయిదావేసింది. అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేల స్థానాలను ఖాళీగా ప్రకటించి వాటిలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలు లేదంటూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం దురైస్వామి బుధవారం ఆదేశించారు.

తమిళనాడు ప్రభుత్వం, పార్టీలో నెలకొన్న పరిణామాలపై వేసిన మూడు పిటిషన్లు, డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గుట్కా ప్యాకెట్లు ప్రదర్శించటంతో స్పీకర్‌ జారీచేసిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసు పిటిషన్లను ఒకదానితో మరొకటి ముడిపడి ఉండటంతో అన్ని పిటిషన్లను న్యాయమూర్తి ఒకేసారి విచారించారు. ‘18 అసెంబ్లీ స్థానాలను ఖాళీగా ప్రకటించి ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయ వద్దు. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంతవరకు దీనిపై నిర్ణయం తీసుకోవద్దు’ అని న్యాయమూర్తి ఆదేశించారు.

వాడి వేడిగా వాదనలు:
దినకరన్‌ వర్గం ఎమ్మెల్యే వెట్రివేల్‌ తరఫున కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్, సుప్రీంకోర్టు బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు దుశ్యంత్‌ దవే.. అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని కోరుతూ డీఎంకే వేసిన పిటిషన్‌పై కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ వంటి ప్రముఖులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలు తమకు తాముగా పార్టీ నుంచి తప్పుకుంటే వారి సభ్యత్వం రద్దవుతుందని.. తద్వారా వారు అనర్హులవుతారన్నారు. కానీ ఈ కేసులో అనర్హత వేటు పడినవారెవరూ.. పార్టీ నుంచి బయటకు వెళ్లలేదని దుశ్యంత్‌ గుర్తుచేశారు.

ఈ వాదనను స్పీకర్‌ తరఫు న్యాయవాది సుందరం తోసిపుచ్చారు. ఒకవేళ ప్రభుత్వం ఈ 18 సీట్లను ఖాళీగా గుర్తించి.. కోర్టు తీర్పు వచ్చేలోపే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేస్తే పరిస్థితేంటని దుశ్యంత్‌ ప్రశ్నించారు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైతే కోర్టు జోక్యం చేసుకోలేదన్నారు. ఇదిలా ఉండగా, పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలను ఎమ్మెల్యేలతో కలసి వెళ్లి బెంగళూరు జైల్లో శశికళకు వివరించేందుకు దినకరన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ములాఖత్‌ కింద ఒకేసారి 21 మంది కలుసుకోవాలంటే హోం శాఖ నుంచి అనుమతి కావాలని జైలు అధికారులు చెప్పడంతో దినకరన్‌ విరమించుకున్నారు.

మరిన్ని వార్తలు