ప్రీపోల్ సర్వే: కేరళలో గెలుపెవరిదంటే..

9 May, 2016 19:36 IST|Sakshi
ప్రీపోల్ సర్వే: కేరళలో గెలుపెవరిదంటే..

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశలు కానీ, కేరళ సీఎం ఊమెన్ చాందీ ఆకాంక్షలు కానీ ఫలించే అవకాశం లేదని సంకేతాలు చాటుతున్నాయి. మోదీ అభివృద్ధి అజెండాను, చాందీ ప్రగతి నినాదాన్ని తోసేసి కేరళ వాసులు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కు పట్టం కట్టే అవకాశముందని తాజాగా ప్రీపోల్స్ సర్వే ఒకటి స్పష్టం చేసింది. 

తిరువనంతపురానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ మానిటరింగ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ (ఐఎంఈజీ) సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో ఎల్డీఎఫ్‌కు 83 నుంచి 90 సీట్లు వచ్చే అవకాశముందని తేలింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 50 నుంచి 57 సీట్లు రావొచ్చునని వెల్లడైంది. ఎప్పటిలాగే బీజేపీ కేరళలో మరోసారి ఖాతా తెరిచే అవకాశం లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉండగా.. మొత్తం అన్ని స్థానాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తన అభ్యర్థులను నిలిపిన సంగతి తెలిసిందే.

కేరళలోని దక్షిణ, ఉత్తర, సెంట్రల్‌ ప్రాంతాల్లో 60వేలమంది ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ ప్రీ పోల్ సర్వే నిర్వహించారు. ఎజావా నేతృత్వంలోని బీజేడీఎస్ బీజేపీకి మద్దతు పలికినప్పటికీ, ఈ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు చాలా స్పల్పంగా ఉన్నాయని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీ కి రెబల్ పోరు బాగా ఎక్కువగా ఉంటుందని, రెబల్ అభ్యర్థుల వల్ల ఆ పార్టీ ఏడు స్థానాలు కోల్పోయే అవకాశముందని సర్వే విశ్లేషించింది. సోలార్ కుంభకోణంలో సీఎం ఊమెన్ చాందీ ప్రమేయముందని 63శాతం మంది కేరళ వాసులు ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. ఇక, 51శాతం మంది వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి ప్రజా అనుకూల విధానాలను అనుసరిస్తోందని అభిప్రాయపడ్డారు.  
 

మరిన్ని వార్తలు