1 నుంచి ఇంటర్వ్యూలు వద్దు

30 Dec, 2015 02:02 IST|Sakshi
1 నుంచి ఇంటర్వ్యూలు వద్దు

జూనియర్ స్థాయి కొలువులకు వర్తింపు
 
 న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో(పీఎస్‌యూ) జూనియర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించకూడదని కేంద్రం ఆదేశించింది. నైపుణ్య, శరీరదారుఢ్య పరీక్షలు కొనసాగించవచ్చని పేర్కొంది. ఇంటర్వ్యూల రద్దు ప్రక్రియను ఈ నెల 31క ల్లా కచ్చితంగా పూర్తి చేయాలని సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు సర్క్యులర్ పంపింది. భవిష్యత్తులో ఉద్యోగ ప్రకటనల్లో ఇంటర్వ్యూల ప్రస్తావన ఉండదు. ఇంటర్వ్యూల రద్దు .. గ్రూప్ సీలోని అన్ని పోస్టులు, గ్రూప్ బిలోని నాన్ గెజిటెడ్, వాటికి సమానమైన అన్ని పోస్టులకు వర్తిస్తుందని వివరించింది. నిర్దిష్ట పోస్టులకు ఇంటర్వ్యూ జరపాలనుకుంటే పూర్తి వివరాలను సంబంధిత మంత్రి ఆమోదంతో జనవరి 7 లోపల తమకు పంపాలని డీఓపీటీ తెలిపింది.

 వేతనాల కోడ్‌కు తుది మెరుగులు: కేంద్రం దేశవ్యాప్తంగా ఏకీకృత కనీసం వేతనం నిర్ణయించేందుకు వీలుకల్పించే వేతనాల లేబర్ కోడ్ రూపకల్పన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ బుధవారం సమావేశమై చిన్నపరిశ్రమల బిల్లుకు తుది మెరుగులు దిద్దనున్నారు. 40 మందికంటే తక్కువ మంది కార్మికులు ఉన్న పరిశ్రమలకు ఈ బిల్లు కింద 14 కార్మిక చట్టాల నుంచి మినహాయింపు ఇస్తారు. బిల్లుకు రూపకల్పన చేశాక ఆమోదం కోసం కేబినెట్‌కు పంపుతారు. వేతానాల చట్టం, చె ల్లింపులు-వేతనాల చట్టం, బోనస్ చెల్లింపు చట్టం తదితర చట్టాల్లోని  నిబంధనలను క్రోడీకరించి వేతనాల కోడ్ తేవాలని కార్మిక శాఖ ప్రతిపాదించడం తెలిసిందే. కాగా, ఉద్యోగినులకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడానికి ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లు ముసాయిదాకు కార్మిక శాఖ తుదిమెరుగులు దిద్దుతోంది. సంప్రదింపుల కోసం దీన్ని త్వరలో వివిధ మంత్రిత్వ శాఖలకు పంపనున్నారు.

మరిన్ని వార్తలు