ప్రధాని చెప్పినా లోన్ ఇవ్వలేదు!

19 Jul, 2016 09:40 IST|Sakshi
ప్రధాని చెప్పినా లోన్ ఇవ్వలేదు!

కాన్పూర్: సాధారణ వ్యక్తిలా బ్యాంకు చుట్టు తిరుగుతున్నా లోన్లు మంజూరు కావడం లేదని పలువురు చెప్తుండటం.. ఆ మాటలు వింటుండటం పరిపాటే. అయితే, ఏకంగా ప్రధాని మంత్రి చెప్పినా కూడా పని అవ్వడం లేదంటే ఏమనుకోవాలి. కాన్పూర్కు చెందిన సందీప్ సోని అనే కార్పెంటర్కు ఈ పరిస్థితి ఎదురైంది. సోని చెక్కతో అద్భుతాలు చేయగలడు. అందంగా చెక్క వస్తువులు తయారుచేయడమే కాదు.. వాటిపై అక్షరాలు కూడా చెక్కగలడు. గత మార్చిలో అతడు 32 చెక్కలపై భగవత్ గీత కు చెందిన 18 భాగాలు, 706 శ్లోకాలు అక్షరాలుగా చెక్కాడు. అందుకు అతడికి మూడున్నర ఏళ్లు పట్టింది.

వీటిని అతడు మోదీకి చూపించగా ఆయన ఆశ్చర్యపోయారు. ఆ ఫొటోలను కూడా మోదీ స్వయంగా ట్విట్టర్ లో పెట్టాడు. దాంతోపాటు అతడికి ఒక చిన్న కార్పెంట్ ఫ్యాక్టరీ పెట్టుకునేందుకు సహాయం కూడా చేస్తానని, అతడికి లోన్ మంజూరు కూడా చేయాలని చెప్పాడు. దీంతో అతడు ప్రధాని మంత్రి ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ప్రొగ్రామ్ (పీఎంఈజీపీ) కార్యక్రమం కింద లోన్ కు దరఖాస్తు చేసుకొని ఇప్పటి వరకు చెప్పులు అరిగేలా తిరిగినా అతడికి మాత్రం ఏ బ్యాంకు నుంచి ఆ సహాయం అందలేదు. దీంతో ప్రధాని చెప్పిన మాటకే దిక్కులేదు.. ఇక సామన్యుడిలా వెళితే బ్యాంకులు పట్టించుకుంటాయా అని ఆగ్రహం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు