ఇక యాపిల్ మేకిన్ ఇండియా!

22 May, 2016 00:55 IST|Sakshi
ఇక యాపిల్ మేకిన్ ఇండియా!

ప్రధాని మోదీతో టిమ్ కుక్ భేటీ
- యాపిల్ ఉత్పత్తుల తయారీ అవకాశాలపై చర్చ
 
 న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్  సీఈఓ టిమ్ కుక్... శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య దేశంలో యాపిల్ ఉత్పత్తుల తయారీ అవకాశాలపై, యువత నైపుణ్యాలు, ఉపాధి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే సైబర్ సెక్యూరిటీ, డేటా ఎన్‌స్క్రిప్షన్ విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. టిమ్ కుక్ భారతీయ యువతను మెచ్చుకున్నారు. భారతీయ యువతలో మంచి నైపుణ్యాలు, సామర్థ్యాలున్నాయని, వాటిని యాపిల్ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో యాప్ డెవలప్‌మెంట్ వృద్ధి ఆవశ్యకతను వివరించారు.

భారత్‌లో కంపెనీ భవిష్యత్ కార్యాచరణను వివరిస్తూ.. బెంగళూరులో యాప్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆవిష్కరణ, హైదరాబాద్‌లో మ్యాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావించారు. అలాగే పునరుత్పాదక ఇంధనం, దేశంలో వ్యాపారానుకూల పరిస్థితుల ఏర్పాటు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. తాజా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రధానికి అభినందనలు తెలిపారు. మోదీ ఆయనకు డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి వివరించారు. దీని ద్వారా ఈ-విద్య, ఆరోగ్యం, రైతుల ఆదాయం పెరుగుదల అంశాలను లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాపిల్ భాగస్వామిగా మారాలని కోరారు.

 భారత ఆతిథ్యం అపూర్వం
 భారత్‌లో స్వాగత మర్యాదలు బాగున్నాయని కుక్ కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ముంబై సిద్ధి వినాయక గుడి దర్శనం, కాన్పూర్ క్రికెట్ మ్యాచ్ వీక్షణం వంటి అంశాలకు సంబంధించిన అనుభూతులను మోదీతో పంచుకున్నారు. దానికి మోదీ స్పందిస్తూ... ‘‘కళ్లారా చూడటమే నమ్మకం’’ అన్నారు. ‘‘భారత్‌లోని మీ అనుభవాలు మీ వ్యాపార నిర్ణయాలను తప్పక ప్రభావితం చే స్తాయని భావిస్తున్నాం’’ అని కూడా చెప్పారు. కుక్‌తోపాటు ఉన్న కొందరు కంపెనీ ప్రతినిధులు రాజస్తాన్‌లోని సౌర విద్యుత్‌తో కళకళలాడుతున్న కొన్ని గ్రామీణ ప్రాంతాల గురించి, సౌర విద్యుత్ ఉపకరణాల అసెంబ్లింగ్‌లో మహిళలు చూపిస్తున్న నైపుణ్యాల గురించి మోదీతో ముచ్చటించారు.

 ఇదే సరైన సమయం
 భారత్‌లో తాము సుదీర్ఘకాలం పాటు కార్యకలాపాలను సాగించాలనుకుంటున్నట్లు కుక్ చెప్పారు. దేశంలో టెలికం సంస్థలు 4జీ హైస్పీడ్ ఇంటర్‌నెట్ సర్వీసులను ప్రారంభిస్తుండటంతో ఇక్కడ విస్తరించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు. జనవరి-మార్చి త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తుండటం.. భారత్‌లో మాత్రం 56 శాతం పెరగ డం.. వంటి అంశాల నేపథ్యంలో యాపిల్ తన వృద్ధి కోసం ఇక్కడ భారీగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటోంది. కాగా కంపెనీ తన సెకండ్ హ్యాండ్ ఫోన్లను భారత్‌లో విక్రయించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవలే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మోదీ-కుక్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
 
‘నరేంద్ర మోదీ’ యాప్
నరేంద్రమోదీ మొబైల్ యాప్‌లో కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. మోదీతో సమావేశం సందర్భంగా టిమ్ కుక్.. ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఆవిష్కరించారు. ఇందులో ఇన్ఫోగ్రాపిక్స్, మీడియా కవరేజ్, వాచ్ లైవ్, మన్ కీ బాత్ ప్రసంగాలు, ఇంటర్వ్యూ, బ్లాగ్స్, బయోగ్రఫీ, గవర్నెన్స్ వంటి తదితర విభాగాలున్నాయి. ఇన్ఫోగ్రాఫిక్స్‌లోకి వెళితే అక్కడ ప్రభుత్వ పాలనకు సంబంధించిన గ్రాఫిక్స్ కనిపిస్తాయి. బయోగ్రఫీపై క్లిక్ చేస్తే మోదీ జీవిత విశేషాలను తెలుసుకోవచ్చు. అలాగే యాప్‌లో ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లను, ప్రధాని ప్రసంగాలను వినొచ్చు. ప్రధానికి సంబంధించిన వార్తలను తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా మన అభిప్రాయాలను ఆయనకు పంపొచ్చు. యాప్‌లో కొత్తగా ‘మై నెట్‌వర్క్’ అనే ఫీచర్ పొందుపరిచారు. ఇక్కడ ఒక అంశం గురించి చర్చను ప్రారంభించవచ్చు. అలాగే ఇతరులను చర్చలోకి ఆహ్వానించవచ్చు.

మరిన్ని వార్తలు