ఆ ఊరంతా పెళ్లికాని ప్రసాదులే!

30 Mar, 2016 13:56 IST|Sakshi
ఆ ఊరంతా పెళ్లికాని ప్రసాదులే!

ఆ గ్రామంలో ఒక్క అబ్బాయికి కూడా పెళ్లి కావడం లేదు. పెళ్లి చేసుకుందామంటే అసలు ఆ ఊరి అబ్బాయిలకు సంబంధాలే రావడం లేదు. దానికి కారణం.. మూడేళ్ల నుంచి వరుసగా పీడిస్తున్న కరువు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కరువు తీవ్రంగా ఉంది. నీళ్ల కొరత కారణంగా పంటలు పండటంలేదు. తెహ్రిమారియా అనే గ్రామంలో అయితే పెళ్లికూతుళ్లు దొరకడం పెద్ద కష్టంగా మారింది. అసలు నీళ్లులేని ఊళ్లోకి తమ ఆడ పిల్లలను ఎలా ఇవ్వాలంటూ అమ్మాయిల తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. 32 ఏళ్ల వయసున్న మోహన్ యాదవ్‌కు సంబంధం చూడాలని వాళ్ల కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. అలా సుమారు 60 మంది మగవాళ్లు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వమే తమకు సాయం చేయాలని, ఒక డ్యామ్ కట్టి నీటి సస్యకు పరిష్కారం చూపిస్తే తమకు పెళ్లిళ్లు అవుతాయని మోహన్ యాదవ్ లాంటివాళ్లు అంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో గల 13 జిల్లాల్లో ఛత్తర్‌పూర్ కూడా ఒకటి. ఈ జిల్లాలన్నింటిలోనూ దాదాపు పదేళ్లుగా కరువు వస్తూ పోతూనే ఉంది. తెరియమార్ గ్రామంలో 400 అడుగుల లోతు వరకు తవ్విన బోర్లు, బావులు కూడా ఎండిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ దూరాలు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. స్టాప్ డ్యామ్ కట్టడానికి ఓ ప్రాంతం చూశామని, కలెక్టర్ అనుమతి మంజూరుచేస్తే వెంటనే పనులు మొదలుపెట్టొచ్చని తహసిల్దార్ బినితా జైన్ అన్నారు. దాంతో ఒకటి రెండేళ్లలో కరువు పూర్తిగా మాయం అవుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు