ఇక బోగీలపై రిజర్వేషన్‌ చార్టులుండవ్‌..!

8 Oct, 2017 10:34 IST|Sakshi

‘చార్టుల’ విధానం ఎత్తేయాలని కేంద్రం నిర్ణయం

ప్రయోగాత్మకంగా 7 స్టేషన్‌లలో అమలు

త్వరలో దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో..

సెల్‌ఫోన్‌ యుగంలో అనవసర ఖర్చు అంటున్న రైల్వే

సాక్షి, హైదరాబాద్‌: ప్లాట్‌ఫాంపైకి ఎక్స్‌ప్రెస్‌ రైలొచ్చి ఆగింది.. ప్రయాణికులు హడావుడిగా తలుపు వద్ద అతికించిన రిజర్వేషన్‌ చార్టులో సీటు నంబర్‌ చూసుకుని తీరిగ్గా కోచ్‌లోకి చేరుకున్నారు.. మరికొద్ది రోజుల్లో ఈ దృశ్యం కనిపించకపోవచ్చు. బోగీలపై రిజర్వేషన్‌ చార్టు అతికించే విధానాన్ని ఎత్తేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘క్లీన్‌ రైల్వే’లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలోని 7 స్టేషన్లలో 4 రోజుల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయాణికుల స్పందన ఆధారంగా అమలుపై నిర్ణయం తీసుకోనుంది. 

ఖర్చు భారీగానే..
పైకి చిన్న విషయంగానే కనిపిస్తున్నా.. చార్టులకు భారీగానే ఖర్చవుతోంది. రూ.లక్షల్లో ఖర్చుతోపాటు వేల సంఖ్యలో పేపర్‌ రోల్స్‌ వాడాల్సి వస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్‌ల నుంచి బయలుదేరే రైళ్లపై చార్టులు అతికించేందుకు సాలీనా రూ.35 లక్షలకుపైగా ఖర్చవుతోంది. ఇందుకు దాదాపు 6,000 పేపర్‌ రోల్స్‌ వినియోగిస్తున్నారు. 

ఇప్పుడు క్షణాల్లో సెల్‌ఫోన్‌కు..
సాధారణంగా రైలు టికెట్‌ బుక్‌ చేసుకున్నపుడు కన్ఫర్మ్‌ ఐతే సీటు/బెర్తు నంబరు తెలిసేది. వెయిటింగ్‌ లిస్టులో ఉండి అనంతరం కన్ఫర్మ్‌ ఐతే సీటు/బెర్తు తర్వాత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం బోగీలపై రిజర్వేషన్‌ చార్టులు అతిచించడాన్ని రైల్వే ప్రారంభించింది. కొద్ది కాలం తర్వాత దీన్ని ప్రైవేటీకరించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే ఇప్పుడు బెర్తుల వివరాలు క్షణాల్లో సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో అందుతున్నందున చార్డుల ఖర్చు, కాగితం వృథా సరికాదని.. కాబట్టి చార్టుల విధానం ఎత్తేయాలని కేంద్రం తీర్మానించింది. 

బెంగళూరులో గతేడాదే..
ఢిల్లీ, హజ్రత్‌ నిజాముద్దీన్, సెంట్రల్‌ ముంబై, ఛత్రపతి శివాజీ టెర్మినస్, హౌరా, వాల్దా, చెన్నై సెంట్రల్, ఎగ్మోర్‌ స్టేషన్‌లలో 4 రోజుల క్రితం ప్రయోగాత్మకంగా చార్టుల ఎత్తివేతను రైల్వే ప్రారంభించింది. బెంగళూరు డివిజన్‌ అధికారులు గతేడాది నుంచే దీన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడు స్టేషన్‌ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించి అన్ని జోన్లకు సమాచారం అందించింది.

స్వచ్ఛ భారత్‌కు వ్యతిరేకం..
రోజూ పాత చార్టు తొలగించి కొత్త చార్టు అతికించే క్రమంలో ఆ ప్రాంతం అసహ్యంగా మారడంతో కడగాల్సి వస్తోంది. అందుకు సిబ్బంది వినియోగం కూడా పెరుగుతోంది. పైగా ‘చార్టు’ విధానం స్వచ్ఛ భారత్‌కు విరుద్ధమని రైల్వే బోర్డు అభిప్రాయపడుతోంది. చార్టు లేకున్నా సెల్‌ఫోన్‌కు వచ్చే సమాచారం, స్టేషన్‌లలో డిస్‌ప్లే బోర్డుల్లో ఉంచటం, 139 నంబరుకు ఫోన్‌ చేసి తెలుసుకునే వెసులుబాటు ఉన్నందున ఆ విధానం ఎత్తేయటం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని బోర్డు భావిస్తోంది. అయితే సెల్‌ఫోన్‌ వినియోగించని వారికి చార్టు లేకుంటే ఇబ్బంది ఉంటుందన్న వాదనా ఉంది.

మరిన్ని వార్తలు