సలహాదారులుగా చుట్టాలొద్దు

29 Aug, 2019 04:10 IST|Sakshi

ఆధారాల్లేకుండా ఆరోపణలు వద్దు

మంత్రివర్గ సహచరులకు ప్రధాని మోదీ హితవు

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌: కచ్చితంగా ఆధారాలుంటేనే ఆరోపణలు చేయాలని, బంధువులను ఉద్యోగాల్లో పెట్టుకోవద్దని మంత్రి వర్గ సహచరులను ప్రధాని మోదీ కోరారు. మంత్రివర్గ సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మీడియాతోగానీ, బహిరంగంగా గానీ అనవసర వ్యాఖ్యలు చేయవద్దని, కేవలం ఆధారాలున్న విషయాలపైనే ఆచూతూచి మాట్లాడాలని సూచించారు. మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో తమకు తెలిసిన వారిని, బంధువులను సలహాదారులుగా నియమించుకోవద్దని కోరారు. పాలన వేగంగా, సవ్యంగా సాగాలంటే కేబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రుల మధ్య సమన్వయం అవసరమన్నారు.

కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంత్రులు కేవలం కార్యదర్శుల స్థాయి అధికారులతో మాత్రమే కాకుండా, జాయింట్‌ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులకు కూడా సమాచారం అందించాలని కోరారు. దీనివల్ల అధికారులందరూ కూడా బృందంలో తామూ భాగమేనని భావించేందుకు వీలుంటుందన్నారు. అధికారులను ప్రోత్సహిస్తూ మెరుగైన ఫలితాలను సాధించాలన్నారు. మంత్రులంతా ఉదయం 9.30 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని, గతంలో చాలా సార్లు చెప్పినప్పటికీ ఈ సూచనను కొందరు పాటించడం లేదన్నారు. అలాంటి వారు ఇకపై ఆచరించాలన్నారు. మంత్రులు క్రమశిక్షణను పాటిస్తే ఉత్పాదకత, పని సామర్ధ్యము పెరుగుతుందన్నారు.

సర్దార్‌ డ్యామ్‌ను చూసిరండి
జలకళ సంతరించుకున్న సర్దార్‌ సరోవర్‌ జలాశయం అందాలను తిలకించాలని ప్రజలను మోదీ కోరారు. బుధవారం ఆయన డ్యామ్‌ ఫొటోలను, నర్మదా నదీ తీరంలోని సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహం ఫొటోలను ట్విట్టర్‌లో ఉంచారు. గుజరాత్‌లోని కేవడియా ప్రాంతంలో నిర్మించిన సర్దార్‌ సరోవర్‌ జలాశయం నీటి మట్టం రికార్డు స్థాయిలో బుధవారం 134 మీటర్లకు చేరింది.  

మరిన్ని వార్తలు