అవినీతి అధికారులకు నో పాస్‌పోర్టు

7 Mar, 2020 09:54 IST|Sakshi

కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ: సస్పెండ్‌ అయిన, అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులకు పాస్‌పోర్ట్‌ జారీ చేయరాదని కేంద్రం ఆదేశాలిచ్చింది. అధికారులకు పాస్‌పోర్ట్‌ జారీ చేసే ముందు సీవీసీ నుంచి క్లియరెన్స్‌ పొందాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారి సస్పెన్షన్‌లో ఉన్నా, దర్యాప్తు సంస్థలు అతడిపై కోర్టులో చార్జిషీట్‌ వేసినా పాస్‌పోర్టు జారీని నిలిపివేయవచ్చని తెలిపింది. అతడికి లేదా ఆమెకు పాస్‌పోర్టు జారీ చేయవచ్చని పై అధికారి సూచించినప్పటికీ అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్‌ క్లియరెన్స్‌ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాలను కోరింది.

అతడు/ఆమెకు అనుమతి ఇవ్వడం వల్ల భారత్‌కు ఆ దేశంతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని, ప్రజోపయోగం కాదని భావించినా, మరే ఇతర కారణంతోనైనా పాస్‌పోర్టును నిరాకరించే అధికారం విజిలెన్స్‌ కమిషన్‌కు ఉందని తెలిపింది. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న అధికారికి కోర్టు సమన్లు జారీ చేసినా, అరెస్టు వారెంట్లు ఇచ్చినా, ఆ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నా దేశం వదిలి వెళ్లరాదని ఏదైనా కోర్టు నిషేధం విధించినా కూడా పాస్‌పోర్టు ఇవ్వరాదని పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలపై విదేశాంగ శాఖ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ)తో సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది శాఖ తెలిపింది. (ఆ గుడిలో టాయిలెట్‌ వారికి మాత్రమే..)

మరిన్ని వార్తలు