సుప్రీం నిర్ణయంతో కేంద్రం నిర్ణయం వెనక్కి

16 Jul, 2018 08:55 IST|Sakshi
రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ (ఫైల్‌ ఫోటో)

సోషల్‌ మీడియాపై ఎలాంటి నిఘా లేదు: కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌

సాక్షి, గాంధీనగర్‌ : ఆన్‌లైన్‌ డేటాపై నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుకోవడంలేదని కేంద్ర సమాచార, ప్రసార సహాయ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రకటించారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ఫేక్‌ న్యూస్‌ కట్టడికి, ఖాతాదారులు పంపించే సందేశాలను పరీశీలించడానికి సోషల్‌ మీడియా హబ్ ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కొందరూ వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం సోషల్‌ మీడియా హబ్‌ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పౌరుల కదలికలు, సంబంధాలపై పూర్తి నిఘా ఉండే రాజ్యాంలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారా? అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని కర్ణావతి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన యూత్‌ పార్లమెంట్‌లో పాల్గొన్న రాజ్యవర్థన్‌ సింగ్‌ సుప్రీం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. ప్రతి వ్యక్తి ఎవరికివారే సోషల్‌ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

ఈ సందర్భంగా రాథోడ్‌ మాట్లాడుతూ.. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పౌరుల వాక్ స్వాతంత్రంపై ఆంక్షలు విధించిన చర్రిత​దేశతొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూదే అని,  అదే పద్దతిని ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ కూడా అనుసరించారని విమర్శించారు. అఖండ భారతదేశం కోసం పాటుపడిన జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు స్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీపై కూడా కాంగ్రెస్‌ పార్టీ ఆంక్షలు విధించిందని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు