సర్టిఫికెట్ల విషయంలో ఎటువంటి ఒత్తిడీ లేదు!

12 May, 2016 14:51 IST|Sakshi

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల వ్యవహారంలో తమపై ఎటువంటి రాజకీయ ఒత్తిడీ లేదని,  తమను ఏ శక్తీ ప్రభావితం చేయలేదని ఢిల్లీ యూనివర్శిటీ వెల్లడించింది. మోదీ సర్టిఫికెట్ల ధృవీకరణ విషయంలో చట్ట ప్రకారమే పరిశీలనా కార్యక్రమం జరిగిందని వర్శిటీ ప్రకటించింది.

దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, ఢిల్లీ యూనివర్శిటీ ఇచ్చిన డిగ్రీ సర్టిఫికెట్లు ఫోర్జరీలని, వర్శిటీలో తాము స్వయంగా పరిశీలిస్తామన్న కేజ్రీవాల్...  ధృవీకరణకోసం డీయూను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికెట్ల సమస్యపై వైస్ ఛాన్స్ లర్ యోగేష్ త్యాగితో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో వర్శిటీ రాజకీయ ఒత్తిడులకు తలొగ్గుతోందన్న ఆరోపణలు అసత్యాలని, యూనివర్శిటీ ఆర్టీఐ సెల్... చట్ట ప్రకారం పనిచేస్తుందని వీసీ తెలిపారు. ప్రధాని సర్టిఫికెట్ల విషయంలో తమపై ఎటువంటి ఒత్తిడీ లేదని ఢిల్లీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తరుణ్ దాస్ సైతం వెల్లడించారు.  ఆప్ ప్రతినిధుల బృందం మోదీ బిఏ రికార్డులను పరిశీలించేందుకు అనుమతించాలన్న డిమాండ్ తో విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో వారు ఉత్త చేతులతో తిరిగి వెళ్ళాల్సి వచ్చిందని వీసీ అన్నారు.

ప్రధానమంత్రి బిఏ, ఎంఏ డిగ్రీలు నకిలీలని, మార్క్స్ లిస్టుతోపాటు, సర్జిఫికెట్ పై ఆయన పేరులో కూడ అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయన్న ఆప్ ఆరోపణలు అసత్యాలని  తేలిపోయింది.  మోదీ డిగ్రీ రికార్డులను బయట పెట్టిన వర్శిటీ... ఆయన సర్టిఫికెట్లు ప్రామాణికమైనవేనని, మార్కులిస్టులో చిన్నపాటి తప్పిదాలు మాత్రం కనిపించాయని తెలిపింది. అంతేకాక ఆయన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లకు సంబంధించిన అన్ని రికార్డులు తమవద్ద ఉన్నాయని దాస్ తెలిపారు.

మరిన్ని వార్తలు