కోర్టుల్లో రాజకీయాలకు తావు లేదు

2 Dec, 2016 02:02 IST|Sakshi
కోర్టుల్లో రాజకీయాలకు తావు లేదు

సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో రాజకీయాలకు తావు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక రాజకీయ పార్టీ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయవచ్చా అనే అంశంపై వాదనల సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘వారి ఆందోళన రాజకీయాలను కోర్టు ముందుకు తెచ్చేలా కనిపిస్తోంది. దీనిని మేము అంగీకరించబోము. రాజకీయాలు న్యాయస్థానాలకు బదిలీ కావాలని మేము కోరుకోవడం లేదు’’ అని న్యాయమూర్తులు జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ ఎన్‌వీ రమణతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిల్ దాఖలు చేశారు.

ఒక రాజకీయ పార్టీ ప్రజాప్రయోజనాల దృష్ట్యా పిటిషన్ దాఖలు చేసినట్లయితే.. కోర్టులు దానిని విచారించవచ్చని ప్రశాంత్ భూషణ్ వాదించారు. అయితే కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ఎన్‌జీవో ఈ పిల్ దాఖలు చేసిందని, ఇందులో రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కలుగజేసుకుని ప్రజాప్రయోజనమా? పార్టీల ప్రయోజన మా? అనేది ఎలా వేరు చేస్తారని ప్రశాంత్ భూషణ్‌ను ప్రశ్నించింది. పార్టీల ప్రతిచర్య వెనుక ప్రజాప్రయోజనం ఉంటుందని, ఒకవేళ అందులో ప్రజాప్రయోజనం లేదని భావిస్తే కోర్టు కొట్టేయొచ్చన్నారు. రాజకీయ పార్టీలు తమ వాదనను వినిపించేందుకు పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. స్వరాజ్ ఇండి యాను రాజకీయ పార్టీగా గుర్తించే విష యంలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే వరకూ వేచి చూస్తామంటూ తదుపరి విచారణను జనవరి 18కి వారుుదా వేసింది.

మరిన్ని వార్తలు