ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదు..!?

15 Oct, 2017 02:58 IST|Sakshi

సైన్యానికి స్వేచ్ఛనిచ్చాం

ఉగ్రవాదులను ఏరేస్తున్న బలగాలు

కశ్మీర్‌ను పరిష్కరిస్తాం

నెహ్రూ వల్లే ఈ సమస్య

పటేల్‌కు స్వేచ్ఛనిస్తే.. మరోలా ఉండేది

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

సాక్షి, బర్డోలి (గుజరాత్‌): కశ్మీర్‌ విషయంలో ప్రపంచంలోని ఏశక్తి భారత్‌ను ఆపలేవని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి భారత్‌ తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన తెలిపారు. చొరబాట్లకు పాల్పడే ఉగ్రవాదులకు ఏరివేయడంలో లోయలోని సైనికులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోనూ, సరిహద్దులోనూ ఉగ్రవాదులకు సైన్యం దీటుగా బదులిస్తోందని అన్నారు. కశ్మీర్‌ భద్రత గురించి దేశంలో ఏ ఒక్కరూ సందేహించాల్సిన అవసరం లేదని రాజ్‌నాథ్‌ అన్నారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్‌ను అపలేవు.. కశ్మీర్‌ సమస్యకు పరిష్కరిస్తాం.. అని ఆయన అన్నారు. గుజరాత్‌లో జరిగిన గుజరాత్‌ గౌరవ్‌ యాత్రలో ఆయన ప్రసంగించారు.

పొరుగునున్న పాకిస్తాన్‌తో శాంతిని నెలకొల్పేందుకు మన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విధాలుగా ప్రయత్నించారని ఆయన చెప్పారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మరీ మోదీ పాకిస్తాన్‌వెళ్లి అక్కడ చర్చలు జరిపారు.. అయితే పాకిస్తాన్‌ ఆలోచనల్లో ఎటువంటి మార్పులు రాలేదని చెప్పారు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం రెచ్చగొట్టేలా కాల్పులకు దిగుతుంది.. మన సైన్యం ఘాటుగా ప్రతిస్పందిస్తే.. తెల్లజెండా ఎగరేస్తారని ఎగతాళిగా అన్నారు.

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నాటి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్వేచ్ఛ ఇచ్చివుంటే.. నేడు కశ్మీర్‌ సమస్య ఉండేది కాదని రాజ్‌నాథ్‌ మరోసారి చెప్పారు.  పండిట్‌ నెహ్రూ వైఫల్యం వల్లే కశ్మీర్‌ సమస్య ఉత్పన్నమైందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు