ఎగవేతదారులకు ఆ హక్కు లేదు: సుప్రీం

13 May, 2019 08:36 IST|Sakshi

న్యూఢిల్లీ : బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఓ వ్యక్తిని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించే రహస్య విధివిధానాల్లో లాయర్‌తోపాటు పాల్గొనే హక్కు సదరు వ్యక్తికి ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన జా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ఉద్దేశ పూర్వక ఎగవేత దారుగా ప్రకటించే క్రమంలో జరిగే బ్యాంకు అంతరంగిక సమావేశానికి సంస్థ ప్రతినిధులు లాయర్‌తో సహా హాజరుకావొచ్చంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్‌బీఐ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ వినీత్‌ సరన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

జూలై 1, 2015న ఆర్‌బీఐ జారీ చేసిన ఉత్తర్వు ఉద్దేశపూర్వక ఎగవేతదారునకు సంబంధిత బ్యాంకు అంతర్గత విధివిధానాల సమావేశాల్లో న్యాయవాదితో పాటు పాల్గొనే హక్కుండదని చెబుతోందని, ఇది సంబంధిత కేసులోని వాస్తవ అంశాలపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ‘రుణం చెల్లించగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ ఎగవేతదారుగా సంబంధిత సంస్థ ప్రకటించిందా లేక పొందిన నిధులను ఇతరత్రా దారి మళ్లించారా? సాయాన్ని నిర్దేశిత ఉద్దేశానికి వాడటానికి బదులుగా ఖర్చుపెట్టారా అనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది’అని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు