‘రెండో తరగతి వరకు స్కూల్‌ బ్యాగ్స్‌ వద్దు’

12 Dec, 2016 14:52 IST|Sakshi
‘రెండో తరగతి వరకు స్కూల్‌ బ్యాగ్స్‌ వద్దు’

న్యూఢిల్లీ: చదువుకునే చిన్నారులకు రెండో తరగతి వరకు పుస్తకాల సంచులు మోసే భారం లేకుండా చూడాలని సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) దాని అనుబంధ పాఠశాలలకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కూష్వాహ సోమవారం లోక్‌సభలో చెప్పారు. చిన్నారుల పుస్తకాల బరువును తగ్గించేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ), సీబీఎస్‌ఈలు చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు.

పూర్వ ప్రాథమిక విద్య కోసం ఎన్‌సీఈఆర్‌టీ ఏ విధమైన పాఠ్యపుస్తకాలనూ సిఫార్సు చేయలేదని ఆయన చెప్పారు. ఒకటవ, రెండో తరగతులకు రెండు పుస్తకాలను, మూడు నుంచి ఐదు తరగతులకు మూడు పుస్తకాలను మాత్రమే సిఫార్సు చేసిందని ఉపేంద్ర వివరించారు. అన్ని పాఠ్యపుస్తకాలు ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌లో డిజిటల్‌ వర్షన్‌లో లభ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు