రెండోసారి గ్యాస్‌ లీక్‌ కాలేదు: ఎన్డీఆర్‌‌ఎఫ్

8 May, 2020 13:02 IST|Sakshi
ఎస్‌ఎన్‌‌ ప్రధాన్

న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి రెండోసారి విషవాయువు లీకైనట్టు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రెండోసారి గ్యాస్‌ లీక్‌ కాలేదని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్‌‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌‌ఎన్‌ ప్రధాన్‌ స్పష్టం చేశారు. రసాయన వాయువును తసట్థం(న్యూట్రలైజ్‌) చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు కొద్దిగా పొగ వస్తుందని, దీన్ని గ్యాస్‌గా పొరబడటం సరికాదని వివరించారు. రెండోసారి గ్యాస్‌ లీకైనట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అనవసర ప్రచారంతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేయొద్దని మీడియాను కోరారు. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్టు వెల్లడించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తమతో మాట్లాడారని ప్రధాన్‌ వెల్లడించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలను పూర్తిస్థాయిలో వైజాగ్‌లో మొహరించామని, అన్నిరకాలుగా సహాయం అందిస్తామని ఆయన హామీయిచ్చారు. (గ్యాస్‌ లీక్‌.. 12కు చేరిన మృతులు)

కాగా,  విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కరికలవలవన్‌ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించింది. గ్యాస్‌ లీకేజీ ప్రమాదానికి గల కారణాలను ఈ కమిటీ విచారించనుంది. మరోవైపు ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఐఏఎస్‌ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధ్యక్షతన ఏపీ ప్రభుత్వం హైకమిటీని ఏర్పాటు చేసింది. 

విశాఖ దుర్ఘటనపై స్పందించిన దక్షిణ కొరియా

మరిన్ని వార్తలు