సరుకు రవాణా వాహనాలకు పాస్‌లు అవసరం లేదు

1 May, 2020 06:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య నడిచే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలు, అన్‌లోడ్‌ చేసి వెళ్లే ఖాళీ వాహనాలకు పాస్‌లు అవసరం లేదని హోం శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తూ ఏప్రిల్‌ 15న జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధన 12(1), నిబంధన 12(6)లపై స్పష్టత ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో సరుకు రవాణా వాహనాలు, అన్‌లోడ్‌ చేసిన వాహనాలను పాస్‌ల పేరిట అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదు లు వచ్చాయని, వీటికి పాస్‌లు అవసరం లేదని, డ్రైవర్‌కు లైసెన్స్‌ ఉంటే చాలునని తేల్చి చెప్పింది.

దేశంలో వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు ఇది తప్పనిసరి అని వివరించింది. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు ఈ ఆదేశాలు పాటించేలా సూచనలు జారీ చేయాలని కోరింది.  దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను స్వస్థలాలకు పంపే విషయంలో జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. కరోనా  ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, వీరిని రోడ్డు మార్గంలో శానిటైజ్‌ చేసిన వాహనాల్లో తరలించాలని తెలిపింది. సంబంధిత రాష్ట్రాల అధికారులు ఈ విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉండాలని సూచించింది.   

మరిన్ని వార్తలు