కోవిడ్‌ 19: ఆ కేసులు పెరగడంపై గుబులు..

21 Apr, 2020 20:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వైరస్‌ లక్షణాలు ఏమాత్రం కనిపించని వారిలో కరోనా మహమ్మారి విస్తృతంగా పెరగడం వైద్య నిపుణులను ఆందోళనలో ముంచెత్తుతోంది. పాజిటివ్‌ కేసుల్లో 83 శాతం కేసుల్లో ఆయా రోగులకు వ్యాధి లక్షణాలు లేవని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. పాజిటివ్‌ కేసుల్లో తమకు వ్యాధి సోకిందని తెలియని వారు అధికంగా ఉండటంతో అప్పటికే మహమ్మారి బారినపడిన వారు వైరస్‌ను సైలెంట్‌గా వ్యాప్తి చేస్తున్నారనే గుబులు మొదలైంది. ఇలాంటి వారితో సమస్యలు తలెత్తడంతో ఇంటింటి సర్వే ద్వారా వయసు మళ్లిన వారికి, హైరిస్క్‌ వ్యక్తులకు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించే ప్రక్రియ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

అయితే ఇది ఖర్చుతో కూడుకున్నదని, నిర్ధేశిత లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదని మరికొందరు నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్‌ సోకిన ప్రతి 100 మందిలో 80 మందికి ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని ఐసీఎంర్‌ చీఫ్‌ ఎపిడెమాలజిస్ట్‌ రామన్‌ ఆర్‌ గంగాకేడ్కర్‌ పేర్కొన్నారు. భారీ జనాభా ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో మాస్‌ టెస్టింగ్‌కు ఐసీఎంఆర్‌ అధికారులు సిఫార్సు చేయకపోయినా ఇంటింటి సర్వే మోడల్‌ను ప్రభుత్వం  పరిశీలిస్తున్నట్టు సమాచారం. పోలియో తరహాలో ఇంటింటి తనిఖీ కరోనా మహమ్మారి నిరోధానికి చేపట్టవచ్చని, మూకుమ్మడి పరీక్షలు మాత్రం మనదేశంలో సాధ్యం కావని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆలోచన ప్రాథమిక దశలోనే ఉందని ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.

చదవండి : డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది

దేశంలో ప్రస్తుతం విదేశాల్లో ప్రయాణించి వచ్చిన వారిలో వైరస్‌ లక్షణాలు ఉన్నవారికి, లాబ్‌ల్లో పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి, లక్షణాలు కనిపించిన వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు తీవ్ర శ్వాససంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్స్‌లో వైరస్‌ లక్షణాలు కనిపించిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలియకుండా వైరస్‌ను వ్యాప్తి చేసే వారు సమాజానికి ప్రమాదకరమని జపాన్‌, ఇటలీ, దక్షిణ కొరియా, అమెరికాలో చేపట్టిన పలు తాజా అథ్యయనాలు కూడా స్పష్టం చేశాయి.

మరిన్ని వార్తలు