టాయిలెట్‌ ఉంటేనే జీతం ఇస్తాం

26 May, 2018 13:04 IST|Sakshi

సీతాపూర్‌, యూపీ : మీరు యూపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగా...? అయితే మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా...? మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే మీకు నెల జీతం అందుతుంది. మరుగు దొడ్డి ఉన్నట్లు చెప్తే సరిపోదు...దానికి సంబంధించిన ఫోటోతోపాటు ప్రమాణ పత్రాన్ని ఇస్తేనే మీకు మీ నెల జీతం అందుతుందనే నూతన నిబంధనను తీసుకు వచ్చింది యూపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతొంది. ఈ ఫోటో యూపీకి చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భగవత్‌ ప్రసాద్‌ది. ఇది అతను తన ఇంటి టాయిలెట్‌లో ఒక స్టూలు మీద కూర్చుని దిగిన ఫోటో.

ఫోటోతో పాటు ప్రమాణ పత్రంలో అతని ఆధార్‌ కార్టు నంబరు, కుటుంబ వివరాలు కూడా ఉన్నాయి. భగవత్‌ ప్రసాద్‌ ఇంట్లో మరుగుదొడ్డి ఉందనే దానికి నిదర్శనం ఈ ప్రమాణ పత్రం. ఈ ప్రమాణ పత్రాన్నిపంచాయితీ ఆఫీసులో ఇవ్వాలి. తర్వాతే అతనికి ఈ నెల జీతం అందుతుంది. ప్రధాని మోదీ 2014లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ పథకం అమలులో భాగంగా యూపీ ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం సీతాపూర్‌ డిస్ట్రిక్ట్‌ మాజిస్ట్రీట్‌ శీతల్‌ వర్మ సీనియర్‌ అధికారులకు ఒక నోటీసు జారీ చేసారు. మీ సిబ్బంది ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయా, ఉంటే వాటి ఫోటోలను తీసి జిల్లా పంచాయితీ రాజ్‌ అధికారులకు పంపిచమని, అలా చేసిన వారికి మాత్రమే జీతం ఇస్తామని ఆదేశించారు.

ఈ విషయం గురించి శీతల్‌ వర్మ ’ప్రధాని మోదీ 2018, అక్టోబరు 2 నాటికి మన దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చాలనే ఉద్ధేశంతో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణం తపప్పనిసరిని తెలిపారు. ప్రజలకు ఈ విషయం గురించి అవగాహన కల్పించాలంటే ముందు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపారు. ఈ నెల 27 నాటికి ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నట్లు ఫోటో పంపించకపోతే వారికి ఈ నెల జీతం ఆపేస్తామన్నారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు