కాలగర్భంలోకి విక్టోరియా బగ్గీలు

20 Apr, 2016 15:00 IST|Sakshi
కాలగర్భంలోకి విక్టోరియా బగ్గీలు

ముంబై: నగర సందర్శనకు వచ్చిన పర్యాటకులకు చారిత్రక ప్రాధాన్యతగల ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ను సందర్శించడం, నారిమన్‌ పాయింట్‌ దిశలో సూర్యాస్తమయాన్ని తిలకించడం ఓ మరిచిపోలేని అనుభూతి. అయితే చారిత్రక వారసత్వపు ఆనవాళ్లుగా కొనసాగుతున్న గుర్రపు బగ్గీలో రాజ కుటుంబీకులవలె దర్జాగా కూర్చొని దక్షిణ ముంబై సముద్రపు ఒడ్డున ముందుకు సాగడం, ఒడ్డుకు తాకుతున్న అలల సవ్వడిని వినడం, అలల మీదుగా శరీరాన్ని తాకే చల్ల గాలులను ఆస్వాదించడం మరింత మరచిపోలేని మధురానుభూతి. ఇక ఈ అనుభూతి మరెన్నో రోజులు అందుబాటులో ఉండదు. స్థానికంగా విక్టోరియాస్‌ అని పిలిచే ఈ బగ్గీలు జూన్‌ ఒకటవ తేదీ నుంచి కాలగర్భంలో కలసిపోనున్నాయి.

జంతుకారుణ్య సంస్థ ‘పెటా’ సుదీర్ఘకాలంగా చేసిన పోరాటం ఫలితంగా వెండి రంగుల్లో తలతలలాడుతూ, రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించే ఈ గుర్రపు బగ్గీలను ముంబై హైకోర్టు గతేడాదే నిషేధించింది. వచ్చే జూన్‌ ఒకటవ తేదీ నుంచి నగరంలో ఒక్క విక్టోరియా కూడా కనిపించకూడదని, అప్పటిలోగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వెతుక్కోవాల్సిందిగా గుర్రపు బగ్గీల యజమానులను, వాటిని తోలే కార్మికులను ఆదేశించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నగరంలో 130 విక్టోరియా బగ్గీలు తిరుగుతున్నాయి.

19వ శతాబ్దంలో కార్లు, ట్రాములు లేనికాలంలో ఈ విక్టోరియా గుర్రపు బగ్గీలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆ తార్వత కార్లు, ఇతర మోటారు వాహనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాక కూడా పర్యాటకులకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటికి వింటేజ్‌ హోదా కూడా లభించాయి. వీటికి వ్యతిరేకంగా పెటా ఆందోళన తీవ్రతరం కావడంతో హైకోర్టు వీటిని నిషేధించాల్సి వచ్చింది. పెటా ఉద్యమానికి బాలివుడ్‌ తారలు ఎంతో మంది మద్దతు తెలపడంతో ఉద్యమం ఊపందుకుంది. ఒకప్పుడు బాలివుడ్‌లో పాపులరైన బహరాని–శ్రీలంక నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్, జీనతమన్, హేమమాలిని, రిచా చద్దా, అనుష్క శర్మ, జాన్‌ అబ్రహం లాంటి వాళ్లు ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. అయితే నగరంలో వారి కార్లు వేగంగా దూసుకుపోయేందుకు వీళ్లేకుండా ఈ గుర్రపు బగ్గీలు అడ్డుపడుతున్నాయనే కోపంతోనే పెటా ఉద్యమానికి వారు వంత పాడారని గుర్రపు బగ్గీల యజమానులు విమర్శించారు.

జూన్‌ తర్వాత మనం ఈ విక్టోరియా బగ్గీల స్వారీని చూడాలంటే 1952లో వచ్చిన సిఐడీ, 1972లో వచ్చిన విక్టోరియా నెంబర్‌ 23లను మళ్లీ చూడాల్సిందే. ఆ సినిమాల్లో ఈ బగ్గీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. షోలో చిత్రంలో హేమమాలిని నడిపేది కూడా విక్టోరియా బగ్గీనే.

మరిన్ని వార్తలు