‘ఎయిర్‌పోర్టుల్లో వీఐపీ కల్చర్‌ లేదు’

26 Nov, 2017 17:21 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇంఫాల్‌ ఎయిర్‌ పోర్టులో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్‌ కన్నన్‌థానమ్ వివాదంపై పౌర విమానయాన శాఖామంత్రి జయంత్‌ సిన్హా తొలిసారి స్పందించారు. దేశంలోని ఏ విమానాశ్రయంలోనూ వీవీఐపీ కల్చర్‌ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే భద్రతాపరమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చని ఆయన తెలిపారు. విమానాశ్రయాల్లో తీసుకునే భద్రతా చర్యలు ప్రయాణికులు సెక్యూరిటీ కోసమేనని ఆయన తెలిపారు.  

భద్రతా కారణాల రీత్యా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంతేకాక భద్రత కల్పించాల్సిన ముఖ్యవ్యక్తులు విమానశ్రయాలకు వచ్చినపుడు సెక్యూరిటీ స్క్రీనింగ్‌ తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఇది వీవీఐపీ కల్చర్‌ కాదని జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు. వీరు తప్ప మిగిలిన ఎవరినైనా విమానాశ్రయాల్లో ఎవరినైనాన సాధారణ ప్రయాణికుడిగానే అధికారులు చూస్తారని ఆయన తెలిపారు. నా బ్యాగ్‌ను నేను మోసుకుంటూ విమానం ఎక్కుతాను.. వీవీఐపీ కల్చర్‌ లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.

రెండు రోజుల కిందట ఇంఫాల్ విమానాశ్రయంలో ఒక మహిళ.. వీవీఐపీ కల్చర్‌పై కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్‌థానమ్‌ను నిలదీయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టుకు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్‌ రావడంతో.. మిగతా విమాన ప్రయాణికులను నిలిపేశారు. దీంతో మిగిలిన విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి. మంత్రి రాకవల్ల ఇబ్బందుల పడ్డవారిలో ఒక మహిళా డాక్టర్‌ ఉన్నారు. ఆమె అత్యవసరంగా ఒకరికి చికిత్స అందించే క్రమంలో పట్నా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీవీఐపీ కల్చర్‌ వల్ల ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ఆమె.. నేరుగా కేంద్రమంత్రినే ఎయిర్‌పోర్టులో నిలదీశారు. 

మరిన్ని వార్తలు