గుడిలోకి తుపాకులు, బూట్లతో వెళ్లొద్దు!

11 Oct, 2018 10:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒడిశాలో ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలోకి పోలీసులు తుపాకులు, బూట్లతో ప్రవేశించరాదని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. పూరీ ఆలయంలో క్యూ పద్ధతిని నిరసిస్తూ ఈ నెల 3న చెలరేగిన ఆందోళనపై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది.

ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకూ 47 మందిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. జగన్నాథ ఆలయానికి 500 మీటర్ల దూరంలోని పరిపాలన కార్యాలయాన్ని అల్లరిమూకలు ధ్వంసం చేశాయనీ, ఆలయం లోపల ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. అయితే ఆలయం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఘర్షణ సందర్భంగా పోలీసులు ఆయుధాలు, బూట్లతో ఆలయంలోకి ప్రవేశించారని ఆరోపించారు.

దీన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్‌ మదన్‌.బి.లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం ఇకపై అలా జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. జగన్నాథ ఆలయంలో క్యూ పద్ధతిని నిరసిస్తూ శ్రీ జగన్నాథ సేన అనే సంస్థ ఇచ్చిన అక్టోబర్‌ 3న పన్నెండు గంటల బంద్‌ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు