రాజద్రోహం, హత్యాప్రయత్నం నేరాల కింద అరెస్ట్‌ చేశారు

15 Oct, 2019 11:24 IST|Sakshi

న్యూఢిల్లీ‌: ప్రవాస భారతీయుడు అభిజిత్‌ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి.. విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు గాను ఈ పురస్కారం వరించింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్‌ నిర్మల, దీపక్‌ బెనర్జీలకు 1961లో కోల్‌కతాలో అభిజిత్‌ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ నోబెల్‌ పురస్కారం అందుకున్న ఈ ఆర్థికవేత్త ఒకప్పుడు కరుడుగట్టిన నేరస్తులను ఉంచే తిహార్‌ జైలులో గడిపారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఏదో పెద్ద నేరం చేసి తిహార్‌ జైలుకు వెళ్లి ఉంటారని భావిస్తే.. పొరపాటే. విద్యార్థి సంఘం నాయకుడికి మద్దతుగా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను ఇతర విద్యార్థులతో పాటు అభిజిత్‌ కూడా తిహార్‌ జైలులో గడపాల్సి వచ్చింది.

ఈ సంఘటన 1983లో చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం ఓ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘జేఎన్‌యూలో ఓ విద్యార్థి సంఘం నాయకుడిని బహిష్కరించారు. ఇందుకు నిరసనగా విద్యార్థులందరూ వైస్‌ చాన్సిలర్‌ను ఘెరావ్‌ చేశాం. దాంతో నాతోపాటు మరికొందరు విద్యార్థులపై కేసు నమోదు చేసి 10 రోజుల పాటు తిహార్‌ జైలులో ఉంచారు. మమ్మల్ని కొట్టారు. అంతేకాక మా మీద రాజద్రోహం నేరమే కాక హత్యానేరాన్ని కూడా మోపారు. అయితే దేవుడి దయ వల్ల ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. మా నిరసన కార్యక్రమం వల్ల మేలే జరిగింది. అడ్మినిస్ట్రేషన్‌ సిస్టంలో మార్పులు జరిగాయి. కానీ పది రోజుల పాటు తిహార్‌ జైలులో ఉండటం మాత్రం జీవితంలో మర్చిపోలేని భయానక అనుభవం’ అంటూ చెప్పుకొచ్చారు అభిజిత్‌.

ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి కలిపి నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. అమెరికన్‌ ఆర్థికవేత్త మైకేల్‌ క్రెమెర్‌తో పాటు అభిజిత్‌ ఆయన భార్య ఎస్తర్‌ డఫ్లో సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన రెండో మహిళగా డఫ్లో నిలిచారు.

మరిన్ని వార్తలు