ట్రాన్స్‌ జెండర్‌ల కోసం ప్రత్యేక రైల్వే స్టేషన్‌

25 Jun, 2020 08:42 IST|Sakshi

లక్నో: నోయిడా మెట్రో రైల్‌ కార్పోరేషన్(ఎన్‌ఎమ్‌ఆరస్‌సీ) బుధవారం ‘ఆక్వా’ లైన్‌లోని (ఈ లైన్‌ నోయిడా స్టేషన్‌ నుంచి గ్రేటర్‌ నోయిడా స్టేషన్‌కు వెళుతుంది) ‘సెక్టార్‌ 50’ స్టేషన్‌ను ట్రాన్స్‌జెండర్‌లకు కేటాయించింది. దాని పేరును ‘రెయిన్‌ బో’‌గా మార్చింది. ఈ మేరకు ఎన్‌ఎమ్‌ఆర్‌సీ  మేనేజింగ్‌ డైరెక్టర్‌ రీతూ మహేశ్వరి బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వ్యక్తులు, ఎన్జీఓల సలహాల తర్వాత.. ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీని ఉద్దేశించి ‘సెక్టార్‌ 50’ స్టేషన్‌ పేరును ‘రెయిన్‌ బో’గా మార్చాం. ట్రాన్స్‌జెండర్‌లు సాధికరత సాధించాలనే గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు ఎన్‌ఎమ్‌ఆర్‌సీ ట్రాన్స్‌జెండర్‌లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈ స్టేషన్‌లో వారి కోసం ప్రత్యేక సదుపాయాలు, వసతులు ఏర్పాటు చేస్తాం’ అన్నారు. (మీ ముద్దు మాకొద్దు)

అంతేకాక అక్కడ దిగి, ఎక్కే ట్రాన్స్‌జెండర్‌ ప్రయాణికులకు కూడా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయని రీతూ మహేశ్వరి తెలిపారు. అంతేకాక నోయిడా మెట్రోలో ఉన్న ట్రాన్స్‌జెండర్‌ స్టాఫ్‌ అందరినీ అక్కడికి బదలీ చేస్తామన్నారు. అందులోని వివిధ విభాగాలలో, కౌంటర్‌లలో ట్రాన్స్‌జెండర్‌లే ఉంటారని తెలిపారు. ఇది పూర్తిగా వారి కోసం కేటాయించిన స్టేషన్‌ అన్నారు. అయితే తొలుత ఈ ‘సెక్టార్‌ 50’ స్టేషన్‌ పేరును ‘షీ మ్యాన్’గా మారుస్తూ.. నోయిడా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ తీర్మానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమయ్యింది. ఈ నిర్ణయం పట్ల ట్రాన్స్‌జెండర్లు నిరసన వ్యక్తం చేయడంతో చివరకు ‘రెయిన్‌ బో’గా మార్చారు.

మరిన్ని వార్తలు