జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

7 Mar, 2020 12:42 IST|Sakshi

లక్నో: సీనియర్‌ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు రాంపూర్‌ కోర్టు ఆమె నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్‌ 20న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కాగా గతంలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన జయప్రద.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాషాయ పార్టీ తరఫున రాంపూర్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జయప్రద.. ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు లక్ష ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆమెకు స్థానిక కోర్టు వారెంట్‌ జారీ చేసింది.

కాగా ఎన్నికల ప్రచారంలో ఆజంఖాన్‌ జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అమ్రపాలి (నృత్యకారిణి), నాచ్‌ నే వాలీ’అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జయప్రద పార్టీ మారిన సమయంలో.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్‌ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు