నెరవేరిన కరుణానిధి చిరకాల కోరిక

31 Jul, 2018 20:39 IST|Sakshi

ఆలయంలో బ్రాహ్మణేతర పూజారిని నియమించిన తమిళనాడు ప్రభుత్వం

సాక్షి, చెన్నై : తమిళనాడు మధురైలోని ఓ ఆలయంలో బ్రాహ్మనేతర పూజారిని నియమించడం ద్వారా ఆలయ అధికారులు కులనిర్మూలన దిశగా ఒక ముందడుగేశారు. దీంతో తమిళ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణానిధి చిరకాల కోరిక నెరవేరినట్లయింది. ఆలయంలో బ్రాహ్మణేతర పూజారులను నియమించడం తమిళనాడులో ఇదే తొలిసారి. 1970లో కరుణానిధి సీఎంగా ఉన్నకాలంలో బీసీ (బ్రాహ్మనేతర) కులాల వారికి కూడా ఆలయ పూజారులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలోని దేవాలయాలకు ఆదేశాలు జారీ చేశారు.

కానీ ఆయన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై 2006లో మరోసారి సమీక్ష నిర్వహించిన కరుణానిధి.. అర్చకులుగా శిక్షణ పొందేందుకు ఆరునెలల సర్టిఫికెట్‌ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కోర్సు చేసిన అన్ని కులాల వారికి దేవాలయాల్లో పూజారులుగా అవకాశం కల్పించాలని భావించారు. డీఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి సుప్రీంకోర్టు తప్పపట్టింది. కోర్టు తీర్పుపై అప్పట్లో కరుణానిధి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కులాలకు సామాజిక న్యాయం చేకురాలనే పెరియార్‌ రామస్వామి ఆశయం మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల డిమాండ్‌ మేరకు 2015లో ఆలయంలో అర్చకుల నియామకాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆగమశాస్త్రం నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు ఉండకూడదని సుప్రీం సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆరు నెలలపాటు అర్చకత్వ కోర్సులో శిక్షణపొందిన వారిని దేవాదాయశాఖ పూజారులుగా నియమించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కరుణానిధికి ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారని డీఎంకే వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు