ఉభయసభల్లో మారని తీరు

12 Dec, 2016 14:30 IST|Sakshi
ఉభయసభల్లో మారని తీరు

నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమన్న ప్రతిపక్షం
న్యూఢిల్లీ: మూడు వారాలు గడుస్తున్నా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఏం మార్పూ లేదు. విపక్షాల ఆందోళన, ప్రభుత్వం ఎదురుదాడి మధ్య శుక్రవారమై  ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదాపడ్డాయి. నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమంటూ లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రకటించినా 16 రోజులుగా సభను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలంటూ ప్రభుత్వం డిమాండ్‌ చేయడంతో గందరగోళం కొనసాగింది. రాజ్యసభలో నోట్ల రద్దు అంశంతో పాటు గోధుమలపై దిగుమతి సుంకం తగ్గించడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభను స్పీకర్‌ వాయిదా వేయగా, వాయిదాల అనంతరం సమావేశమైన రాజ్యసభలో కోరం లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్ తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు.

లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత ఖర్గే మాట్లాడుతూ... నోట్ల రద్దు, దాని పరిణామాలపై చర్చించేందుకు ప్రతిపక్షం సిద్ధంగా ఉందన్నారు. ఇంతలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ.. విపక్షాలు 16 రోజులుగా సభను నడవనీయలేదని అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ సభ్యురాలు మీనాక్షీ లేఖీ మాట్లాడుతూ... రాష్ట్రపతి సూచించినట్లు నిరసనలు, ధర్నాల కోసం జంతర్‌మంతర్‌ సరైన వేదికని పార్లమెంట్‌కాదన్నారు. ఉదయం సభ మొదలవగానే డిసెంబర్‌ 13, 2001న పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటనను గుర్తు చేసుకుంటూ... ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి నివాళులర్పించారు.

కోరం లేక రాజ్యసభ వాయిదా.. గోధుమలపై దిగుమతి సుంకం ఎత్తివేయడంపై రాజ్యసభలో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, జేడీయూ, లెఫ్ట్‌ పార్టీలు నిరసన తెలిపాయి. ఈ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గోధుమల కొరత లేదని, ఇటీవల ధరలు పెరగడంతో తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు  ఆహార మంత్రి పాశ్వాన్ చెప్పారు. ఇదే తుది నిర్ణయం కాదని, అవసరమనుకుంటే సమీక్షించవచ్చన్నారు. ఇంతలో కురియన్ జీరో అవర్‌ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని సహించేది లేదంటూ నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు