పౌర బిల్లుపై భగ్గుమన్న ఈశాన్యం

12 Dec, 2019 15:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయసభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య భారతంలో బిల్లుకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు కొనసాగతున్నాయి. పోలీసు కాల్పులు, లాఠీచార్జ్‌, రైళ్ల నిలిపివేతతో ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేగింది. అసోం, త్రిపురల్లో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడంతో సైన్యం, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనల నేపథ్యంలో అసోం, త్రిపురలో విమాన, రైలు సర్వీసులు దెబ్బతిన్నాయి.

కర్ఫ్యూ ఉత్తర్వులను ధిక్కరించి గువహటిలో పెద్దసంఖ్యలో ఆందోళనకారులు వీధుల్లోకి చేరడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నగరంలోని లాలుంగ్‌ గావ్‌ ప్రాంతంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులకు గాయాలయ్యాయని స్ధానికులు పేర్కొన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో లోకల్‌ ట్రైన్లను నిలిపివేశామని అధికారులు తెలిపారు. రైలు, విమాన సర్వీసులకు విఘాతం కలగడంతో ఇరు రాష్ట్రాల్లో ప్రయాణీకులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేయడం కూడా ప్రజలకు అసౌకర్యం కలిగించింది. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుతో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. ​

>
మరిన్ని వార్తలు