ఆరెస్సెస్‌లో మహిళా నేతలేరి?

1 Feb, 2018 02:43 IST|Sakshi
షిల్లాంగ్‌లో వృద్ధురాలిని పలకరిస్తున్న రాహుల్‌

షిల్లాంగ్‌: ఆరెస్సెస్‌ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌)లో మహిళలకు ప్రాధాన్యం ఉండదనీ, అందులో నాయకత్వ స్థానాల్లో స్త్రీలు లేనే లేరని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఈ నెల 27న శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా ప్రస్తుతం రాహుల్‌ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఓ చోట ఆయన మాట్లాడుతూ ‘ఆరెస్సెస్‌లో ఎన్ని నాయకత్వ స్థానాల్లో మహిళలు ఉన్నారో మీలో ఎవరికైనా తెలుసా? సున్నా’ అన్ని అన్నారు.

‘మీరెప్పుడైనా మహాత్మా గాంధీ ఫొటో చూస్తే ఆయన చుట్టూ మహిళలు కనిపిస్తారు. కానీ మోహన్‌ భాగవత్‌ ఫొటోను ఎప్పుడైనా చూశారా? ఆయన ఒంటిరిగా లేదా చుట్టూ పురుషులతోనే ఉంటారు. ఆయన చుట్టూ మహిళలు ఎప్పుడూ ఉండరు’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇంకా ‘సూటు–బూటు’ మనిషిలానే వ్యవహరిస్తున్నారనీ, ఆయన చుట్టూ ఎప్పుడు వివిధ కంపెనీల ప్రతినిధులే ఉంటారు తప్ప పేదలతో మోదీ మాట్లాడరని రాహుల్‌ మరోసారి దుయ్యబట్టారు. 

>
మరిన్ని వార్తలు