వాయుసేనలోకి 100 యుద్ధ విమానాలు

1 Sep, 2017 13:13 IST|Sakshi



సాక్షి, న్యూఢిల్లీ:
భారత రక్షణ శాఖ 100 కొత్త తరానికి చెందిన యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం భారతీయ వాయుసేన ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేట ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఎఫ్‌-16, స్వీడన్‌కు చెందిన గ్రైపెన్స్‌ జెట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఎఫ్‌-16 జెట్లను లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ అభివృద్ధి చేయగా.. గ్రైపెన్స్‌ జెట్లను సాబ్‌ అనే స్వీడిష్‌ కంపెనీ తయారు చేసింది.

డబుల్‌ ఇంజిన్‌ జెట్లైన రఫెల్‌ యుద్ధ విమానాలను మరిన్ని కొనుగోలు చేయాలని భారత్‌ భావిస్తోందనే కథనాలు గతంలో జాతీయ మీడియాలో వెలువడ్డాయి. అయితే, కేవలం 32 స్క్వాడ్రన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్న వాయుసేనకు సింగిల్‌ ఇంజిన్‌ జెట్ల అవసరం చాలా ఉంది. 2021 కల్లా భారత్‌ వద్ద ఉన్న మిగ్‌-21, మిగ్‌-27 జెట్లు వాయుసేన నుంచి తప్పుకుంటాయి. దీంతో కొరత మరింత తీవ్ర అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న వాయుదళం.. ఎఫ్‌-16, గ్రైపెన్‌ ఫైటర్లలో ఏదో ఒకదాన్ని కొనుగోలు చేయాలని భావిస్తోంది.

2021కి మరో మూడేళ్లే ఉన్నా.. 18 జెట్లను మాత్రమే విదేశాల నుంచి తెప్పించి, మిగతా వాటిని మేక్‌ ఇన్‌ ఇండియా ప్రోగ్రామ్‌ కింద భారత్‌లోనే తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లాక్‌హీడ్‌ మార్టిన్‌, సాబ్‌లు భారత్‌కు జెట్లు అందించేందుకు ముందుకు వచ్చాయి. అయితే, లాక్‌ హీడ్‌ మార్టిన్‌ ఇప్పటికే ఎఫ్‌-16 జెట్లను పాకిస్తాన్‌కు అందించింది.



దీంతో భారత వాయుసేన ఎఫ్‌-16 జెట్లను తీసుకోవడానికి ఇష్టపడుతుందా? లేదా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. స్వీడన్‌కు చెందిన గ్రైపెన్స్‌ విమానాన్ని కూడా అత్యాధునిక సాంకేతికతో అభివృద్ధి చేశారు. భారత్‌కు గ్రైపెన్స్‌ జెట్లను అందించేందుకు సాబ్‌, అదానీ గ్రూప్‌తో జట్టు కట్టింది. వచ్చే రెండు నెలల్లో భారత రక్షణ శాఖ నుంచి జెట్ల ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కాగా, 2023 కల్లా 36 రఫెల్‌ యుద్ధ విమానాలు భారత వాయుదళంలో చేరతాయి. మరో పక్క స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఎల్‌సీఏ తేజస్‌ యుద్ధవిమానాల తయారీని వేగవంతం చేయాలని ఎయిర్‌ ఫోర్స్‌ ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ను కోరింది.

మరిన్ని వార్తలు