అసెంబ్లీ సీట్ల పెంపులేదు

28 Jul, 2016 01:12 IST|Sakshi
అసెంబ్లీ సీట్ల పెంపులేదు

విభజన చట్టాన్ని సవరించినా పెంపు కుదరదు.. రాజ్యసభలో తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం
 
- తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ప్రతిపాదన ఏదీ మా పరిశీలనలో లేదు
- రాజ్యాంగంలోని నిబంధనలే చెల్లుబాటవుతాయి
- దేవేందర్‌గౌడ్ ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ జవాబు
- 2026 తరువాతే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు అవకాశం
 
 సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల నాటికి శాసనసభ స్థానాల సంఖ్య పెరుగుతుందనే భరోసాతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు తమ పార్టీ కండువాలు కప్పుతున్న అధికార పక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించడం ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీట్ల పెంపు ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలోనే లేదని తేల్చి చెప్పింది. దీనిపై రాజ్యసభలో బుధవారం టీడీపీ ఎంపీ టి.దేవేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహీర్ సవివరంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

 ఆర్టికల్ 170ని సవరిస్తేనే పెంపు సాధ్యం
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో కేంద్ర హోం శాఖ కేంద్ర న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరిం దా? కోరితే ఆ వివరాలేంటి? అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమైనా కోరారా? కోరితే అటార్నీ జనరల్ ఏం చెప్పారు? రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు కుదరదన్న ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని హోం మంత్రిత్వ శాఖ ఎలా స్వీకరిస్తోంది? వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ దిశగా ముందుకు వెళ్లేందుకు హోం మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి? అంటూ దేవేందర్‌గౌడ్ సుదీర్ఘమైన ప్రశ్నను సంధించారు. దీనికి మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహీర్ సమాధానం ఇచ్చారు. ‘‘ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర న్యాయ శాఖను కోరాం.

మూడు ప్రశ్నలు అడిగాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా.. ఆంధ్రప్రదేశ్  పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26ను సవరించి సెక్షన్ 26(1)ను అమలు చేయవచ్చా? ఒకవేళ సెక్షన్ 26ను సవరించాల్సి వస్తే.. అప్పుడు సెక్షన్ 26లో ఒకరకంగా, రాజ్యాం గంలోని ఆర్టికల్ 170లో ఒక రకంగా ఉంటే.. ఈ రెండూ ఒకదానికి ఒకటి సంఘర్షించుకుంటే అప్పుడు ఏది చెల్లుబాటవుతుంది? ఒకవేళ సెక్షన్ 26లో పొందుపరిచిన ‘ఆర్టికల్ 170లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి’ అన్న వాక్యానికి బదులుగా ‘ఆర్టికల్ 170లోని నిబంధనలకు సంబంధం లేకుం డా’ అనే వాక్యం చేర్చి సవరిస్తే సరిపోతుందా? అన్న మూడు ప్రశ్నలపై న్యాయశాఖ సలహాను కోరాం.

ఇవే ప్రశ్నలపై న్యాయశాఖ భారత అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. ఇందుకు వారు ఇచ్చిన సలహా ఏమిటంటే..  రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్  పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26ను సవరించి సెక్షన్ 26(1)ను అమలు చేయలేం అని చెప్పారు. ఒకవేళ సెక్షన్ 26ను సవరించాల్సి వస్తే.. అప్పుడు సెక్షన్ 26లో ఒకరకంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఒక రకంగా ఉంటే .. ఈ రెండూ ఒకదానికి ఒకటి సంఘర్షించుకుంటే అప్పుడు ఏది చెల్లుబాటవుతుందని అడిగినప్పుడు నిస్సందేహంగా పార్లమెంట్ ఏ చట్ట సవరణ చేసినా రాజ్యాంగంలోని నిబంధనలే చెల్లుబాటు అవుతాయని, రాజ్యాంగంలోని నిబంధనలదే పైచేయి అవుతుందని చెప్పారు’’ అని ఆయన వివరించారు.

 అలా కూడా కుదరదు
 ‘‘ఒకవేళ సెక్షన్ 26లో పొందుపరిచిన ‘ఆర్టికల్ 170లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి’ అన్న వాక్యానికి బదులుగా ‘ఆర్టికల్ 170లోని నిబంధనలకు సంబంధం లేకుండా’ అనే వాక్యం చేర్చి సవరిస్తే సరిపోతుందా? అని మేం అడిగిన ప్రశ్నకు... అలా కుదరదు అని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రస్తుతానికి అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఎలాంటి ప్రతిపాదన మా పరిశీలనలో లేదు’’ అని హన్స్‌రాజ్ గంగారాం స్పష్టం చేశారు.
 
 విభజన చట్టంలో ఏముంది?
 రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి శాసనసభ స్థానాల పునర్వ్యవస్థీకరణ చేపట్టవచ్చని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26లో పొందుపరిచా రు. ఆర్టికల్ 170లోని నిబంధనల ప్రకారం... 2026 తరువాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంటుం దన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెక్షన్ 26ను సవరించినా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది.

మరిన్ని వార్తలు