అక్కడ 'నోటా' దుమ్మురేపింది!

22 May, 2016 11:25 IST|Sakshi
అక్కడ 'నోటా' దుమ్మురేపింది!

పై వారెవరూ కాదు (నన్‌ ఆఫ్‌ ది అబో- నోటా).. అని ఈవీఎంలపై ఉండే ఈ మీటనే తాజా ఎన్నికల్లో ఓటర్లను ఎక్కువగా ఆకర్షించినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కును ఓటర్లకు కల్పిస్తున్న నోటాకు పశ్చిమ బెంగాల్‌లో భారీగా ఓట్లు పోలయ్యాయి. బెంగాల్‌లోని చాలా నియోజకవర్గాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌, ప్రతిపక్ష వామపక్ష-కాంగ్రెస్ కూటమి, బీజేపీల తర్వాత అత్యధిక ఓట్లు నోటాకే పడ్డాయి. దీంతో 'నోటా'నే నాలుగో పోటీదారుగా చాలాచోట నిలిచింది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన బీఎస్పీ, సీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఎస్‌యూసీఐ, స్వతంత్ర అభ్యర్థుల కంటే కొన్నిచోట్ల నోటాకే అధిక ఓట్లు రావడం గమనార్హం.

ఇదే తరహా పరిస్థితి ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పుదుచ్చేరి, తమిళనాడు, అసోంలోనూ కనిపించింది. ఇక్కడ కూడా 'నోటా'కు ఓటర్లు గణనీయంగానే మొగ్గుచూపారు. ఒక్క కేరళలో మాత్రం 'నోటా'కు చాలా తక్కువమంది ఓటు వేశారు. అసోంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంటే 'నోటా'కే ఎక్కువ ఓట్లు పడటం గమనార్హం. బెంగాల్‌లో 6.6 కోట్ల ఓటర్లు ఉండగా, అందులో 8లక్షలకుపైగా మంది ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 'నోటా'కు ఓటు గుద్దారు. బెంగాల్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఐదులక్షలకుపైగా 'నోటా'ను వినియోగించుకున్నారు.

మరిన్ని వార్తలు