నోట్లరద్దుపై మాటల యుద్ధం

8 Nov, 2017 01:55 IST|Sakshi

ఆర్థిక వ్యవస్థ నాశనం.. పన్ను ఉగ్రవాదానికి బీజం

చిరు, మధ్య తరగతి వ్యాపారులకు తీవ్ర నష్టమన్న మన్మోహన్‌ సింగ్‌

నోట్లరద్దు, జీఎస్టీ నైతిక నిర్ణయాలే

మన్మోహన్‌ నేతృత్వంలోనే లక్షల కోట్ల కుంభకోణాలు: అరుణ్‌జైట్లీ

అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నోట్లరద్దు, జీఎస్టీలు అనైతిక నిర్ణయాలని, ఇవి పన్ను ఉగ్రవాదానికి బీజం వేశాయని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ దీటుగా స్పందించారు.

కేంద్రం నిర్ణయంతో చాలా ప్రయోజనం జరిగిందని.. మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే దేశంలో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఘాటుగా ప్రతివిమర్శలు చేయటంతో రాజకీయ యుద్ధం మొదలైంది. కాగా, నోట్లరద్దుకు నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విపక్షాలన్నీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అటు బీజేపీ కూడా.. నోట్లరద్దు లాభాలను ప్రజలు వివరిస్తూ ‘అవినీతి వ్యతిరేక దినం’ జరిపేందుకు సిద్ధమైంది.

నోట్లరద్దు, జీఎస్టీలతో విధ్వంసం
దేశ ఆర్థిక వ్యవస్థకు నోట్లరద్దు, జీఎస్టీ భారీ నష్టాన్ని కలిగించాయని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. నోట్లరద్దును ‘చరిత్రాత్మక తప్పిదం’ అని తాను పేర్కొన్నప్పటికీ.. బీజేపీ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం తీరును మన్మోహన్‌ తూర్పారబట్టారు. నోట్లరద్దు, జీఎస్టీతోపాటుగా బుల్లెట్‌ రైలు, ఇతర ప్రభుత్వ నిర్ణయాలపైనా ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.‘నోట్లరద్దు.. వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధంగా కొల్లగొట్టడం’ అని మన్మోహన్‌ పునరుద్ఘాటించారు. జీఎస్టీ మోదీ తొందరపాటు నిర్ణయానికి ఉదాహరణ అని విమర్శించారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మన్మోహన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా ఇబ్బందిపడ్డ చిన్న, మధ్యతరగతి వ్యాపారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ‘నోట్లరద్దుతో పన్ను ఎగవేత, నల్లధనం వెలికితీత సాధ్యం కాదు. రాజకీయ స్వలాభం కోసమే నోట్లరద్దు తీసుకొచ్చారని స్పష్టమైంది. అక్రమార్కులంతా తప్పించుకున్నారు. ఉద్యోగాలు పోయాయి. యువకులకు అవకాశాలు సన్నగిల్లాయి. వ్యాపారాలు అసంతృప్తికర స్థితిలో ఉన్నాయి.

అంతేకాదు, ఈ నిర్ణయం వల్ల చైనా లాభపడగా దేశీయ వ్యాపార రంగం కుదేలైంది’ అని మన్మోహన్‌ విమర్శించారు. దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని చెప్పినా.. గుణపాఠం నేర్చుకునేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ‘పేదలు, అణగారిన వర్గాలు, రైతులు, చిరు, మధ్యతరగతి వ్యాపారులు.. ఇలా కొన్ని వర్గాలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని పార్లమెంటులో చెప్పాను. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని మన్మోహన్‌ వెల్లడించారు. నోట్లరద్దు, జీఎస్టీ వ్యాపార సమాజంలో పన్ను ఉగ్రవాదానికి బీజం వేశాయని మన్మోహన్‌ విమర్శించారు.  విదేశీ పెట్టుబడులు గత 25 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయన్నారు.

నోట్లరద్దు పెద్ద స్కాం: మమత  
మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ‘నోట్లరద్దు ఓ పెద్ద స్కాం. కొందరు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని ఆమె పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో నిష్పాక్షిక విచారణ జరిపిస్తే అన్ని విషయాలూ బయటకొస్తాయన్నారు. కాగా, నోట్లరద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు బుధవారం దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని నిర్ణయించాయి. వీటికి పోటీగా..  అవినీతి వ్యతిరేక దినంగా జరపాలని బీజేపీ నిర్ణయించింది.  


మన్మోహన్‌ నేతృత్వంలోనే దోపిడీ: జైట్లీ
నోట్లరద్దుపై మన్మోహన్‌ చేసిన విమర్శలు, ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఖండించారు. నోట్లరద్దు, జీఎస్టీ పూర్తి నైతిక కార్యక్రమాలని చెప్పుకొచ్చిన జైట్లీ.. దేశంలో 2జీ, సీడబ్ల్యూజీ, బొగ్గు కేటాయింపులు మొదలైన కుంభకోణాల ద్వారా ప్రజల సొమ్ము లూటీ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోనే జరిగిందని పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థను క్రమపద్ధతిలోకి తీసుకురావటం, పన్ను పరిధి విస్తృతి, స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థకు నోట్లరద్దు దోహదపడిందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో జైట్లీ మాట్లాడారు. భారత ప్రతిష్టను నోట్లరద్దు, జీఎస్టీ మసకబార్చాయన్న మన్మోహన్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘2014కు ముందు, 2014 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషించుకోండి’ అని మాజీ ప్రధానికి సూచించారు.

‘సరైన విధానాల్లేక ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టింది మీరే. ఇప్పుడు పరిస్థితి మారింది.  సంస్కరణల ఫలితాలు కనబడుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. ‘నల్లధన వ్యతిరేక ఉద్యమం నైతికంగా వాస్తవమైంది.. అందువల్ల రాజకీయంగా సరైనదే. 2జీ, కామన్వెల్త్‌ గేమ్స్, బొగ్గు కేటాయింపులు ఇలా వివిధ కుంభకోణాలతో దేశాన్ని లూటీ చేసిందెవరు?’ అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ‘నోట్లరద్దు అన్నింటికి పరిష్కారం కాదు. వ్యవస్థలో మార్పులు తీసుకురావటంలో అత్యంత కీలకంగా మారింది’ అని జైట్లీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు