‘పీఏం కేర్స్‌’ కేటాయింపులపై చిదంబరం సందేహం

14 May, 2020 11:41 IST|Sakshi
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఉద్దీపన ప్యాకేజీలు, కేటాయింపులపై పెదవి విరుస్తున్న కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి  పి చిదంబరం  మరోసారి కేంద్రంపై తన దాడిని ఎక్కు పెట్టారు. వలస కార్మికులకు పీఎం-కేర్స్ కేటాయించిన రూ.1000 కోట్ల వినియోగంపై సందేహాలు లేవనెత్తారు. కరోనా వైరస్‌ సంక్షోభం లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైన వలస కార్మికుల కోసం కేటాయించిన రూ.1000 కోట్లలో వారికి చేరేది శూన్యమని విమర్శించారు. ‘దయచేసి సాధారణ తప్పు చేయవద్దు. ఈ డబ్బు వలస కార్మికులకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది. కార్మికుల ప్రయాణ ఖర్చులు, వసతి, మందులు, ఆహారం ఇతర ఖర్చులను భరించటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది తప్ప వలస కార్మికుల చేతుల్లోకి ఏమీ వెళ్ళద’ని చిదంబరం గురువారం ట్వీట్ చేశారు.

అలాగే అన్ని ఆదాయ వనరులు మూసుకుపోయిన తరువాత వలస కార్మికుడి జీవనం ఎలా అని ఆయన ప్రశ్నించారు. అన్ని అడ్డంకులను దాటి తన గ్రామానికి తిరిగి వచ్చిన వలస కార్మికుడికి గ్రామంలో ఉపాధి, ఉద్యోగాలు లేవు. ఆదాయం లేదు. ఈ పరిస్థితుల్లో సదరు కార్మికుడు తన కుటుంబాన్ని ఎలా ఆదుకుంటాడని చిదంబరం ప్రశ్నించారు. (కరోనా ప్యాకేజీ: మాల్యా స్పందన)

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా లేకపోవడాన్ని తీవ్రంగా విమర్శించిన చిదంబరం సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేశారు. సొంతగ్రామాలకు వెళ్లేందుకు ఆకలి కడుపులతో వందల కిలోమీటర్లు నడుస్తున్న పేద వలస కార్మికులను ప్రస్తావించక పోవడం, వారిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అని విమర్శించిన సంగతి విదితమే.

కాగా, కోవిడ్‌-19పై పోరాటానికి గాను పీఎం కేర్స్ ఫండ్‌  బుధవారం 3,100 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటిలో వెంటిలేటర్లను కొనడానికి రూ. 2,000 కోట్లు, వలస కూలీలకు సహాయం చేయడానికి రూ. 1,000 కోట్లు, కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతవూరికి పయనమవుతున్న వలస జీవులు అనేకమంది మధ్యలోనే ప్రమాదాల కారణంగాప్రాణాలు విడుస్తున్న తీరు ఆందోళనకరంగా మారింది. గురువారం నాటికి భారతదేశం కరోనా వైరస్ కేసులు గురువారం నాటికి 78,003 కు పెరిగాయి,  2,549 మరణాలు  సంభవించాయి. 

మరిన్ని వార్తలు