ఉయ్యూరు వాసి దోషి

14 Jun, 2014 01:38 IST|Sakshi
ఉయ్యూరు వాసి దోషి

భార్యాపిల్లల్ని హతమార్చిన కేసులో అమెరికా కోర్టు నిర్ధారణ
3న జీవితఖైదు విధించనున్న జ్యూరీ

 
 చికాగో/ఉయ్యూరు : భార్యతో పాటు తన ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా గొంతు కోసి దారుణంగా హతమార్చిన కేసులో.. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం, గండిగుంట గ్రామానికి చెందిన చెందిన కంప్యూటర్ సైంటిస్టు లక్ష్మీనివాసరావు నెరుసును మిచిగాన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. సంతోషం కొరవడిన వైవాహిక జీవితం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నలభై ఆరేళ్ల లక్ష్మీనివాసరావు 2008 అక్టోబర్ 13న మిచిగాన్‌లోని తన ఇంట్లో ఈ దారుణానికి తెగబడ్డాడు.

 

మృతదేహాలను ఇంట్లోనే ఉంచి మరుసటి రోజే హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాడు. తన సోదరుడి కుటుంబ సమాచారం తెలియటం లేదని లక్ష్మీనివాస్ సోదరుడు అక్కడి పోలీసులకు పిర్యాదు చేయడంతో హత్య జరిగిన రెండు వారాలకు అసలు విషయం వెలుగుచూసింది. ఎఫ్‌బీఐ కేసు దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడు స్వదేశానికి వెళ్లినట్టు నిర్ధారించుకుని సీబీఐని సంప్రదించారు. ఇంటర్‌పోల్ సైతం ఎఫ్‌బీఐ జారీ చేసింది.

అప్పట్నుంచీ మారువేషాల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని 2013లో హైదరాబాద్ శివార్లలో పోలీసులు అరెస్టు చేశారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద హత్యాభియోగాల విచారణ కోసం అతన్ని మిచిగాన్‌కు పంపారు. కాగా గురువారం కేవలం రెండు గంటల్లోపు ముగిసిన సమాలోచనల అనంతరం ఏడుగురు మహిళలు, నలుగురు పురుష న్యాయమూర్తులతో కూడిన విస్త­ృత ధర్మాసనం (జ్యూరీ) లక్ష్మీనివాస్‌ను నేరస్తుడిగా నిర్ధారించినట్టు డెట్రారుుట్ ఫ్రీ ప్రెస్ వెల్లడించింది.

అంతకుముందు వారం రోజుల పాటు కొనసాగిన విచారణ అనంతరం జ్యూరీ ఈ తీర్పు వెలువరించింది.విచారణ సంద ర్భంగా.. కుటుంబసభ్యులను హతమార్చడాన్ని లక్ష్మీనివాస్ ఖండించలేదు. ఎలాంటి భావోద్వేగాన్నీ వ్యక్తం చేయలేదు.  హత్యలకు పాల్పడినట్టుగా అంగీకరించిన లక్ష్మీనివాస్.. నాటి ఘటనలకు సంబంధించిన వివరాలను మాత్రం గుర్తుకు తెచ్చుకోలేక పోతున్నానని చెప్పాడు. ఆ సమయంలో అతని మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని డిఫెన్సు అటార్నీ వాదించినప్పటికీ న్యాయమూర్తులు దాన్నెంత మాత్రమూ విశ్వసించలేదు. వచ్చే నెల 3న కోర్టు అతనికి పెరోల్‌కు అవకాశం లేని జీవితఖైదును విధించనుంది.  
 
భార్యాపిల్లల్ని వరుసగా..: ఆ రోజు ఉదయం లక్ష్మీనివాస్ భార్య జయలక్ష్మి (37)తో గొడవపడ్డాడు. ఆమెపై దాడి చేసి వంటగదిలో వాడే కత్తితో పలుమార్లు పొడిచి అనంతరం ఆమె గొంతు కోసేశాడు. తర్వాత పాఠశాల నుంచి ఇంటికి తిరిగివచ్చే కూతురు తేజస్వి (14) కోసం మాటేసి ఆమె లోపలికి వచ్చిన వెంటనే హతమార్చాడు. ఆ తర్వాత 40 నిమిషాలకు ఇంటికి వచ్చిన కుమారుడు శివకుమార్ (12)నూ అదే విధంగా చంపేశాడు. లక్ష్మీనివాస్‌కు జయలక్ష్మి సొంత మేనత్త కూతురు. లక్ష్మీనివాస్ వివాహేతర సంబంధమే ఈ దారుణానికి పురిగొల్పిందనేది జయలక్ష్మి బంధువుల వాదన.  
 
 

మరిన్ని వార్తలు