'ఆత్మ' తక్కువ కథ ఎక్కువ!

6 Aug, 2014 14:39 IST|Sakshi
'ఆత్మ' తక్కువ కథ ఎక్కువ!

దేశంలో ఆత్మకథల పరంపర కొనసాగుతోంది. నట్వర్ సింగ్ వివాదం ఇంకా చల్లారకముందే తెర మీదకు మరో ఆత్మ కథ వచ్చింది. ఇప్పటికే తమ ఆత్మకథలతో సంజయ్బారు, పీసీ పరేఖ్, నట్వర్ సింగ్ తదితరులు సంచలనం సృష్టించగా.... తాజాగా మార్గరెట్ అల్వా ఈ జాబితాలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మార్గరెట్ అల్వా కూడా త్వరలో తన ఆత్మకథ రాయబోతున్నారు. రాజస్థాన్ గవర్నర్ గా పదవీ విరమణ చేసిన ఆమె త్వరలో పెన్ను పట్టుకోనున్నారు. సాధారణ కుటుంబం నుంచి రాజ్ భవన్ వరకూ సాగిన తన పయనం గురించి ఆమె ఈ పుస్తకంలో వివరించనున్నట్లు సమాచారం. అయితే వివాదాలు సృష్టించేందుకు ఈ పుస్తకం రాయటం లేదని మార్గరెట్ స్పష్టం చేయటం విశేషం.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద  మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ద మేకింగ్, అన్‌మేకింగ్' అప్పట్లో టాక్ ఆఫ్ ది నేషన్ అయిన విషయం తెలిసిందే. మహా భారతంలో భీష్ముడితో మన్మోహన్‌ను పోల్చిన సంజయ్‌ బారు, సోనియా ఎలా చెబితే అలా మన్మోహన్‌ నడుచుకున్నారని ఆ పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే మన్మోహన్‌ ప్రధాని అని, సోనియా కనుసన్నల్లోనే ఆయన పాలన సాగించారంటూ విమర్శలు గుప్పించారు.

ఇక సంజయ్ బారును స్పూర్తిగా తీసుకున్నారో ఏమో....కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శిగా పని చేసిన పీసీ పరేఖ్ కూడా 'క్రూసేడర్‌ అండ్‌ కాన్‌స్పిరేటర్‌' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం ద్వారా  తీవ్ర సంచలనం సంచలనం సృష్టించింది. తన పుస్తకంలో  బొగ్గు మసి మొత్తం బయటపెట్టిన ఆయన  కోల్‌గేట్‌ వ్యవహారంలో ప్రధాని పాత్రపై నిగ్గుతేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇక అంతకు ముందు బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ 'మై కంట్రీ.. మై లైఫ్‌' పేరుతో ఆత్మకథను రాశారు. రాజకీయాల్లో ఉక్కుమనిషిగా తన ఇమేజ్‌ను పెంచుకునే విధంగా ఈ పుస్తక రచన సాగిందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది.

అధికారం అనుభవించిన వారి జీవితాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎక్కడ రహస్యం ఉంటుందో అక్కడ ఆసక్తి ఉంటుంది. అధికారం అన్నప్పుడు, అధికారం ఉన్నవారి వద్ద పని చేసినప్పుడు.... వారి మధ్య ఎన్నో రహస్యాలు ఇమిడి ఉంటాయి. అలాంటి వారు ఆత్మకథలు రాస్తే అవి మిగతావారికి ఆసక్తిని రేకెత్తించటంలో సందేహం లేదు. అయితే అధికారం చేతులు మారాక... ప్రయివేట్ సంభాషణలను ఆత్మకథల పేరుతో బయట పెట్టడం ఎంత వరకూ సమంజసం. సంచలనాల కన్నా మీడియా మాత్రం మాస్ మసాలా దొరికినట్లే.

గతంలో మన్మోహన్పై సంజయ్ బారు, తాజాగా సోనియాపై నట్వర్ సింగ్ వెల్లడించిన విషయాలు అందరికి ముందు నుంచి తెలిసినవే. వారంటూ కొత్తగా చేసిన ఆరోపణలు ఏమాత్రం లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుస్తకాల అమ్ముకోవటానికి, వార్తల్లో నిలవటానికి జిమ్మిక్కులని కొట్టి పారేస్తున్నారు. నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఆత్మ కథల్లో ...'కథ'లు తప్ప దానిలో ఆత్మ కనిపించటం లేదని వినికిడి.

మరిన్ని వార్తలు