భారత్‌లో తొలి వై-ఫై ఇంటర్నెట్ కుగ్రామాలు

11 Jan, 2016 08:13 IST|Sakshi
భారత్‌లో తొలి వై-ఫై ఇంటర్నెట్ కుగ్రామాలు

నలుగురు ఐటీ నిపుణుల కృషి ఫలితం
భోపాల్: షకీల్ అంజుమ్, అతని ముగ్గురి స్నేహితులు కేవలం కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేసి చూపించారు కూడా. గ్రామ పంచాయతీలు కూడా చేయలేని పనిని అతి తక్కువ ఖర్చుతో చేసి చూపించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని మూడు గ్రామాలకు ఉచిత వై-ఫై ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు.

భారత్‌లోని తొలి వై-ఫై ఇంటర్నెట్ గల కుగ్రామాలు ఇవేనని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమే స్ఫూర్తిగా బవడికెడ జాగీర్, శివ్‌నాథ్‌పురా, దేవ్రియా గ్రామాల్లో విజయవంతంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించగలిగామని ఈ యువకుల బృందంలో ఒకరైన షకీల్ అంజుమ్ చెప్పారు.
 
  ‘ఈ పనిని మేమే స్వయంగా చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నాం. మా లక్ష్యం సాధించడానికి రూ.రెండు లక్షలు ఖర్చు చేశాం. నిరంతరాయంగా ఇంటర్నెట్ ఇవ్వడం వల్ల కనీసం 100 మంది మొబైల్ యూజర్లు ఎంతగానో ప్రయోజనం పొందుతున్నారు. కరెంటు లేకున్నా ఇబ్బంది లేకుండా చేసేందుకు 200 ఆంపియర్ల సామర్థ్యం గల ఇన్వెర్టర్‌ను కూడా అమర్చాం’ అని అంజుమ్, తుషార్,భాను, అభిషేక్ వివరించారు.
 
 అభినందించిన ముఖ్యమంత్రి చౌహాన్
 రాజ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తరుణ్ కుమార్ పిఠోడ్ ఈ నెల 1న ఉచిత వై-ఫై రూటర్లను ఆవిష్కరించారు. ఈ గ్రామాల్లో నలుగురు యువకులు ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా కియోస్క్ కూడా వీళ్ల వై-ఫైను ఉపయోగించుకుంటోంది. మారుమూల ప్రాంతానికి వై-ఫై సదుపాయం తెచ్చిన ఈ నలుగురు యువకులను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా అభినందించారు. సాటి యువకులకు వీళ్లు మార్గదర్శకంగా నిలిచారని ప్రశంసించారు. వీరి భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన నిధులు, సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు