రైళ్లలోనూ లగేజి చార్జీలు!

6 Jun, 2018 02:03 IST|Sakshi

నిబంధనలు అతిక్రమిస్తే ఆరు రెట్ల జరిమానా

న్యూఢిల్లీ: విమానాల్లోలాగే రైళ్లలోనూ అదనపు లగేజీకి అదనంగా చార్జ్‌ చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. అడ్డూఅదుపు లేకుండా కంపార్ట్‌ మెంట్లను సామానుతో నింపేస్తుండడంతో, ప్రయాణి కుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు దశాబ్దాలుగా ఉన్న నిబంధనలను ఇకపై కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనిప్రకారం పరిమితికి మించి లగేజీ కలిగిఉన్న ప్రయాణికులు ఆరు రెట్లు ఎక్కువగా జరిమానా చెల్లించాల్సి రావచ్చని ఓ రైల్వే అధికారి తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం స్లీపర్‌ క్లాస్, లేదా రెండవ తరగతి ప్రయాణికుడు 40 కేజీల వరకు రుసుము చెల్లించకుండా తమతోపాటే లగేజీ తీసుకెళ్లవచ్చు. అంతకుమించితే 80 కిలోల వరకు తగిన రుసుము చెల్లించాలి. అయితే అదనపు లగేజీని సంబంధిత లగేజీ వ్యాగన్లోనే పెట్టాల్సి ఉంటుంది. ‘ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నవే... పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాం.

లగేజీకి సరిపడ రుసుము చెల్లించకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరు రెట్లు జరిమానా విధించే అవకాశం ఉంది’ అని రైల్వే శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ వేదప్రకాశ్‌ చెప్పారు. ‘ఉదాహరణకు ఒక ప్రయాణికుడు 80 కిలోల లగేజీతో 500 కి.మీ. ప్రయాణిస్తే.. 40 కిలోల వరకు చార్జీ ఉండదు. అదనపు 40 కిలోల లగేజీకోసం రూ.109 చెల్లిస్తే సరిపోతుంది. తనిఖీలలో అదనపు లగేజీతో పట్టుబడితే రూ.654 జరిమానా చెల్లించాలి.

ఏసీ ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణికులు 70 కిలోల వరకు ఉచితంగా లగేజీ తీసుకెళ్లొచ్చు. 150 కిలోల లగేజీ ఉంటే మిగిలిన 80 కిలోలకు చెల్లించాలి. ఏసీ టూ టైర్‌ ప్రయాణీకులకు 50 కిలోల వరకు చార్జీ ఉండదు. ప్రయాణీకుల సూట్‌కేసులు, ట్రంకు పెట్టెలకు నిర్ణీత పరిమాణాన్ని సూచిస్తున్నాం’ అని వేదప్రకాశ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు