వందే భారత్ మిషన్ : ఆ విమానాలకు బ్రేక్?

29 Jun, 2020 11:31 IST|Sakshi

వందే భారత్ మిషన్: యూఏఈ బ్రేక్

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా  వైరస్, లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమంలో వందే భారత్ మిషన్ కు  మరో ఎదురు దెబ్బ ఎదురైంది. ఇప్పటికే ఈ మిషన్ కు అమెరికా మెకాలడ్డగా తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా నివేదికల ప్రకారం ఎయిరిండియా విమానాలకు అనుమతి లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాదు యూఏఈ  పౌరులను భారతదేశానికి తరలించే ఎయిరిండియా విమానాలకు కూడా అనుమతిని నిరాకరించినట్టు తెలుస్తోంది. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎవరైనా భారతదేశం నుండి దుబాయ్ వెళ్లాలని కోరుకుంటే, వారు న్యూఢిల్లీలోని యూఏఈ రాయబార కార్యాలయం ఆమోదం పొందాలని ప్రకటించింది.  

భారీ డిమాండ్ నేపథ్యంలో అక్కడి వారిని స్వదేశానికి  తీసుకొచ్చేందుకు ఇండియా-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా దుబాయ్ అనుమతి కోరుతోంది. మరోవైపు జులై 1 నుంచి నాలుగో విడతలో భాగంగా యూఏఈకి మొత్తం 59 ప్రత్యేక విమానాలను కేటాయించినట్టు కేంద్రం చెప్పింది. జులై 1 నుంచి 14 వరకు యూఏఈలో చిక్కుకున్న భారతీయులను ఈ  విమానాల ద్వారా భారత్‌కు తీసుకురానున్నట్టు  ప్రకటించింది. 

కాగా వందే భారత్ మిషన్ కింద భారతీయులను తిరిగి ఇండియాకు చేరవేసే ఎయిరిండియా విమానాలను అమెరికా రవాణా శాఖ (డాట్) నిషేధిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.   ప్రత్యేక అనుమతితో తప్ప జూలై 22 నుండి  ఇండో-యుఎస్ మార్గాల్లో చార్టర్డ్ విమానాలను నడపడానికి  ఎయిరిండియాను అనుమతించబోమని అమెరికా  తెలిపిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు